Minister Anam Review on Mulanakshatram Arrangements: మూలానక్షత్రం రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సమయంలో ఎవరికీ ప్రత్యేక దర్శనాలు ఉండవని ఆయన వెల్లడించారు. సాధారణ దర్శనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, దసరా ఉత్సవాల నిర్వహణ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జీ.సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు వారికి సులభతరమైన దర్శనం కల్పించేందుకు సేవలందిస్తున్న వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు భక్తులకు అందిస్తున్న త్రాగునీరు, పాలు, మజ్జిగ వంటి ద్రవపదార్ధాలను కూడా మొత్తం 5 క్యూలైన్లలో ఉన్న అవసరమైన ప్రతి భక్తుడికి అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలోనూ మూడు క్యూ లైన్ల ద్వారా అనుమతుల మేరకు అమ్మవారి దర్శనానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు.
వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు
ఎలాంటి రుసుము చెల్లించకుండా దర్శనం: ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు ఆదేశాలను అనుసరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఆనం చెప్పారు. లక్షల్లో తరలిరానున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా కొండపై సౌకర్యాలను పెంచామని అన్నారు. సాధారణ సందర్భాల్లో ఉండే దర్శనం టికెట్ల ధరలు రేపు ఉండవని స్పష్టం చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు వీఐపి దర్శనం మాదిరిగానే ఎలాంటి రుసుము చెల్లించకుండా సంతృప్తికర దర్శనం పొందేందుకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
కొద్దిమందికి మాత్రమే అంతరాలయ దర్శనం: మూలా నక్షత్రం రోజున ఎవరికీ అంతరాలయ దర్శన ప్రవేశం ఉండదన్నారు. సీఎం కుటుంబ సభ్యులు, భద్రతా విభాగ కార్యాలయం సూచించిన కొద్దిమంది ప్రజా ప్రతినిధులకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని వివరించారు. దర్శనం అనంతరం వేద పండితులు చంద్రబాబుకు తీర్థ, ప్రసాదాలు వేదాశీర్వచనం అందజేస్తారని తెలిపారు. ఇటీవల దుర్గగుడి వద్ద కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రమాదం, ఆ తర్వాత చేపట్టిన పనుల ఫోటో ప్రదర్శనను సీఎం తిలకిస్తారని మంత్రి ఆనం అన్నారు.
14 నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' - పవన్ ఆదేశాలు
"రూ.2.3కోట్ల కట్టలు, నాణేల కుప్పలు" - భారీగా తరలివచ్చిన భక్తులు