NARA LOKESH YUVAGALAM TODAY UPDATES: చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఊరూరా ఎదురేగి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. స్థానికులతో మమేకమైవుతున్న లోకేశ్.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. 9వ రోజు చిత్తూరు జిల్లాలో జోరుగా సాగింది. పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లె నుంచి నడకను ప్రారంభించిన లోకేశ్‌కు.. అడుగడుగున మహిళలు హరతులతో స్వాగతం పలికారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. గజమాలలు వేస్తూ ఆహ్వనించారు. వజ్రాలపల్లె బస కేంద్రంలో బీసీ సంఘాల నేతలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు.. లోకేశ్‌కు వివరించారు. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని యువనేత వారికి హామీ ఇచ్చారు.
తుంబకుప్పం క్రాస్‌కు చేరుకొన్నాక లోకేశ్‌ను కలిసిన మామిడి రైతులు.. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. తోటలు తొలగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు పాలనలో మామిడి రైతులను అదుకున్నామన్న లోకేశ్.. ప్రస్తుతం వ్యవసాయ మంత్రి రైతుల గురించి పట్టించుకొనే పరిస్థితి లేదని.. ఫైల్ దొంగిలించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటును సైతం అడ్డుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
జగన్ పాలనలో కష్టాలు పడుతున్న ప్రజల కోసమే యువగళం చేపట్టాను. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. దళితులపై దాడులు, హత్యలు చేయడానికి జగన్.. వైసీపీ సైకోలకు లైసెన్సు ఇచ్చారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టిన దాఖలాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా..పాదయాత్రకు ఎవరైనా అడ్డొస్తే జగన్నే కాదు...ఆయన తాతనైనా తొక్కుకుంటూ పోతాము. -నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మరోపక్క నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి ఇంటి ఎదుట పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే లోపే.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, పాదయాత్ర పూర్తయ్యేనాటికి ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో మిగలరని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని గౌరు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పందించి పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని అన్నారు.
ఇవీ చదవండి