TDP leaders Counter to Mithun Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చర్చకు రమ్మని మిథున్ రెడ్డి సవాలు చేయడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. లోకేశ్ ను బయటికి పంపిన తరువాత చర్చకు రమ్మని మిథున్ రెడ్డి పిలవడం వారి పిరికితనానికి నిదర్శనమని ఆరోపించారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత మిథున్ రెడ్డికి లేదని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ టీడీపీ నాయకులకు ఒకలా.. వైసీపీ నాయకులకు ఒకలా ఎన్నికల కమిషన్ అమలుచేస్తుందని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత మిథున్ రెడ్డికి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన ప్రాజెక్టులపై వైసీపీ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు సెల్‌కాన్, సుజికీ లాంటీ అనేక పరిశ్రమలు చిత్తూరు జిల్లాకు తెచ్చారని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో మాత్రం మొత్తం అంతా విధ్వంసమే అని, అమర్‌రాజాను చిత్తూరు జిల్లా నుంచి పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. ఒక వైపు బహిరంగ చర్చకు వస్తానని చెప్పి.. మరోక వైపు ఎలక్షన్ కోడ్ ఉందని జిల్లాలో లోకేశ్‌ను ఉండనీవకుండా నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారని విమర్శించారు.
ఎన్నికల కోడ్ ఉందని పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను తంబళ్లపల్లి నుంచి తరలించిన అధికార యంత్రాంగం వైసీపీ నేతలను ఎందుకు యదేచ్ఛగా తిరగనిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈరోజు ఉదయం నుండి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ జెండాలు పట్టుకొని వేలాదిమంది తంబళ్లపల్లిలో ఊరేగుతుంటే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ నిస్తేజులై చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి వర్తించని ఎన్నికల కోడ్ వైసీపీకి వర్తించకపోవటం.. జిల్లా అధికార యంత్రాంగం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్ ను బయటికి పంపిన తరువాత చర్చకు రమ్మని మిథున్ రెడ్డి పిలవడం వారి పిరికితనానికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. లోకేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్నపుడు చర్చకు పిలిస్తే రాకుండా రెండు రోజులు ఇంట్లో దాక్కొని ఇప్పుడు మాట్లడటం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లా మొదలైన దగ్గర నుంచి జిల్లా దాటే వరకు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఒకసారి గుర్తుంచుకోవాలన్నారు. లోకేశ్ తిరిగి వచ్చాక ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. లోకేశ్ కు వైసీపీ నాయకుల్లా పిల్లిలాగ దాక్కోవడం అలవాటులేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ టీడీపీ నాయకులకు ఒకలా.. వైసీపీ నాయకులకు ఒకలా ఎన్నికల కమిషన్ అమలుచేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. క్యాంప్ నుంచి లోకేశ్‌ను పంపించిన వైసీపీ నాయకులు సభలు, ర్యాలీలు పెట్టుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందిందే తప్ప.. వైసీపీ హయాంలో జరిగింది శూన్యమని ధ్వజమెత్తారు. అక్రమాలను ప్రశ్నించినందుకు ఓంప్రకాశ్‌ను చంపించింది పెద్దిరెడ్డి అని నక్కా ఆరోపించారు. కుప్పంలో మైనింగ్ మాఫియాకు తెరలేపారని దుయ్యబట్టారు. వైసీపీకి వత్తాసు పలకకుండా ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలి మార్చుకోవాలని నక్కా సూచించారు. నెల రోజుల పాటు లోకేశ్ చిత్తూరు జిల్లాలో ఉంటే అభివృద్ధిపై మాట్లాడని మిథున్ ఇప్పుడు చర్చకు రమ్మంటున్నారని ఎద్దెవా చేశారు.
ఇవీ చదవండి: