కార్మికులకు ఉపాధి... చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమ... ఆర్థిక ఒడిదుడుకులతో మూతపడి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో తిరుపతి - చెన్నై రహదారిపై గాజులమండ్యం సమీపంలో ఏర్పాటైన ఈ చక్కెర కర్మాగారం 2015 వరకూ కొనసాగింది. పరిశ్రమ యాజమాన్యం వైఫల్యం.... చక్కెర ధరల్లో ఏర్పడిన ఒడిదొడుకుల ఫలితంగా మూతపడింది. అక్కడి నుంచి పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోగా.. పరిశ్రమ పరిధిలో చెరకు పండిస్తున్న రైతులు ప్రైవేటు పరిశ్రమలకు ఆశ్రయించాల్సి వస్తోంది. వారు చెప్పిన ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమపై ఆధారపడి.. చిత్తూరు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో దాదాపు 20 వేల మంది రైతులు చెరకు సాగు చేస్తున్నారు. మూతపడిన పరిశ్రమను తెరిపించేందుకు గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 13.5 కోట్లు చెల్లించింది. సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి మరో 14 కోట్ల రూపాయల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్న కారణంగా.. ఇప్పటికీ కర్మాగారం తెరుచుకోలేదు. ప్రభుత్వం తక్షణమే సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సహకార చక్కెర కర్మాగారాన్ని ముఖ్యమంత్రి తెరిపించాలని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి: