చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు సమీపంలోని బేటగుట్టపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ వ్యవహారంపై చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏఎస్పీ రిశాంత్ రెడ్డికి విచారణ బాధ్యతలు అప్పగించారు. పలమనేరు డీఎస్పీ తో కలిసి విచారణ బృందాలు కేసు దర్యాప్తు ప్రారంభించారు. విగ్రహాల ధ్వంసం ఘటనకు కారణమైన వారి కోసం పోలీసులు అన్వేషిస్తుండగా.. అనుమానితుల పేరిట తెలుగుదేశం నాయకులను అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. కుప్పం పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు.
ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులతో చర్చించిన ఏఎస్పీ రిషాంత్ రెడ్డి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. విచారణకు సహకరించాలని కోరారు.
రాష్ట్రప్రభుత్వ ఉదాసీనత నిర్లక్ష్యం కారణంగానే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు వందల కొద్దీ ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. దేవాలయాల్లో దాడుల ఘటనలపై సీబీఐ విచారణను కోరాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పిల్లలమర్రికి పునరుజ్జీవం.. ఆ మహావృక్షం మాత్రం శిథిలావస్థకు