వైకాపా నేతల బెదిరింపులకు భాజపా భయపడదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అధికార దర్పంతో విర్రవీగుతున్న సీఎం జగన్కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన.. లోక్ సభ ఉప ఎన్నిక సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కోగల ధైర్యం భాజపాకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. అమరావతి అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను మోదీ సర్కారు విడుదల చేసినట్లు తెలిపారు. మూడు రాజధానులు అంశం పై స్పందించిన సోము వీర్రాజు.. అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా.. ఏ ఎన్నికల్లోనైనా అధికార పార్టీ విజయం సాధించిందా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచడమే కాకుండా.. ఎన్నికల వేళ ఓటుకు లెక్కగట్టి డబ్బులు పంచారన్నారు. ప్రభుత్వాధికారులు వైకాపా కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ది అజెండాగా తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. ఉపఎన్నికల్లో జనసేనతో కలిసి ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యం: చంద్రబాబు