భరతమాత దాస్యశృంఖలాలు తెంచేందుకు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిన మహత్తర స్వాత్రంత్య పోరాటంలో.. ఆంధ్ర రాష్ట్రం ఎన్నదగిన పాత్ర పోషించింది. అందులో మదనపల్లె మరింత ప్రత్యేకంగా నిలిచింది. ధీరుల అసమాన పోరాటాలకు వేదికైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భరతజాతిని ఏకతాటిపై నిలిపే మన జాతీయగీతం 'జనగణమన' తుదిరూపు సంతరించుకుందీ ఈ గడ్డపైనే.
జాతీయ గీతానికి తుది ఆకృతి..
మారుమూల ప్రాంత యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దే సమున్నత లక్ష్యంతో ఏర్పాటై, స్వాతంత్య్ర కాంక్ష రగిల్చి.. ఎందరినో పోరువీరులుగా మలిచిన వేదిక మదనపల్లె బీటీ కళాశాల. విద్యాసుగంధాలను పరిమళింపజేసి, సంగ్రామ జ్వాల ఎగసిన ఈ విద్యాకేంద్రాన్ని సందర్శించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్.. ఇక్కడే జాతీయ గీతానికి తుది ఆకృతినిచ్చారు. 1911 నాటి బెంగాలీ రచనను 1919 ఫిబ్రవరి మాసాంతన.. BT కళాశాల ప్రాంగణంలో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఆ సమయంలోనే సర్వాలు కట్టించి, గీతాలాపాన చేయించి.. జాతి జనులను ఒక్కటిచేసే, గుండెల నిండా స్ఫూర్తిని నింపే 'జనగణమన'కు ప్రస్తుత రూపమిచ్చారు.
బాణీ కట్టిన మార్గరెట్ కజిన్స్..
రవీంద్రుడి రచనకు B.T.కళాశాల అప్పటి సంగీత ఉపాధ్యాయురాలు మార్గరెట్ కజిన్స్.. అత్యద్భుతమైన బాణీ కట్టారు. ఆమె చెంత సరిగమలు నేర్చుకున్న విద్యార్థులు మృదు మధురంగా ఆలపించిన ఈ గీతం.. 1950 జనవరి 26 నుంచి జాతీయగీతంగా మనజాతిని ఏకం చేస్తోంది
క్విట్‌ఇండియా సంగ్రామ భేరి
జాతీయ గీతాకేంద్రంగా భాసిల్లుతున్న B.T.కళాశాలను కార్యస్థలంగా చేసుకున్న అనిబిసెంట్.. 1916-1917లో హోంరూల్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అనంతరం 1945లో క్విట్‌ఇండియా సంగ్రామ భేరి మోగించి జైలుకెళ్లిన గాంధీజీని విడుదల చేయాలంటూ.. ఈ కాలేజీ విద్యార్థులు నిరసనాగ్ని రగిలించారు.
ఇదీ చదవండీ.. TDP Protest: చమురు ధరలపై తెదేపా పోరుబాట.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్