పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో ఏడుగురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. చిత్తూరులో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమ పాఠశాలలకు మంచిపేరు తేవాలనే స్వార్థంతో కొందరు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మాల్‌ప్రాక్టీసుకు పాల్పడ్డారని, వారికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సహకరించారని డీఐజీ చెప్పారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పాఠశాలలో ఈ నెల 27న మాల్‌ప్రాక్టీస్ చోటుచేసుకుంది. కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇందుకు కారణం. ఈ నెల 27న ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. నెల్లేపల్లి పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా ఉన్న సోము (ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు) తనకు సన్నిహితుడైన పవన్‌కుమార్‌రెడ్డి (ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు)ని నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల లోపలకు అనుమతించారు. పవన్‌కుమార్‌రెడ్డి తన సెల్‌ఫోన్‌తో 9.37కి ప్రశ్నపత్రం ఫొటో తీసి, 9.41కి తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉన్న కృష్ణారెడ్డి చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ సురేష్‌కు పంపారు. సురేష్ తిరుపతిలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఉపాధ్యాయుడు సుధాకర్‌కు, ఆయన తిరుపతి చైతన్య పాఠశాల డీన్ మోహన్‌కు, మోహన్ నారాయణ పాఠశాలకు చెందిన గిరిధర్‌రెడ్డి పాటు చైతన్య ప్రిన్సిపాల్ ఆరిఫ్‌కు పంపారు. ఇలా నిమిషాల్లోనే ప్రశ్నపత్రం వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది. గిరిధర్‌రెడ్డి చిత్తూరు టాకీసు అనే వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో చిత్తూరు డీఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన బృందాన్ని అప్రమత్తం చేసి గిరిధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారం మొత్తం కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలని, టాపర్లుగా నిలవాలనే కోణంలో సాగింది.ప్రశ్నపత్రం ద్వారా జవాబులు, కీ.. రాసి వాటిని తమ పాఠశాలల విద్యార్థులకు ఆయాలు, వాటర్‌బాయ్‌లు, సహాయకుల ద్వారా అందిస్తున్నట్లు గుర్తించాం. విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. మాల్‌ప్రాక్టీసుకు పాల్పడిన చంద్రగిరిలోని శ్రీ కృష్ణారెడ్డి చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, తిరుపతి ఎన్‌ఆర్‌ఐ అకాడమీ టీచర్ సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ఆరిఫ్, తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డి, తిరుపతి చైతన్య పాఠశాల డీన్ మోహన్, గంగాధరనెల్లూరు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌జీటీ సోమును అరెస్టు చేశాం’ అని డీఐజీ వివరించారు. బీ మాల్‌ప్రాక్టీసు కేసుతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సోము, పవన్‌కుమార్‌రెడ్డిలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా డీఈవో పురుషోత్తం ఆదేశాలు జారీచేశారు.
నంద్యాల జిల్లాలో మరో 9 మంది అరెస్టు : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో భాగంగా మొదటిరోజున తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. శుక్రవారం మరో 9 మంది ఉపాధ్యాయులను అరెస్టుచేశారు.అల్ట్రాటెక్ పాఠశాలకు చెందిన రవీంద్రగుప్త, సుబ్బారెడ్డి, అంకిరెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలకు చెందిన హరినారాయణ, రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్, తుమ్మలపెంట ప్రాథమిక పాఠశాలకు చెందిన వీరేష్, మదన్‌మోహన్, కనకాద్రిపల్లె ప్రాథమిక పాఠశాలకు చెందిన మిథున్‌తేజ, మదనంతపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన శ్రీనివాసరెడ్డిలపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచినట్లు కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. 10మంది ఉపాధ్యాయులు, సిబ్బందిపై కేసు