తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. తిరుపతిలో జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శన భాగ్యం దక్కకపోవడంతో ఆందోళనకు దిగారు. సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇవ్వాలన్న తితిదే నిర్ణయంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సర్వదర్శనం టోకెన్ల జారీపై తిరుపతిలో నిరసనకు దిగారు. సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో ప్రవేశపెడుతూ తితిదే తీసుకొన్న నిర్ణయంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరోనా రెండో దశ తీవ్రత తగ్గిన తర్వాత ఈ నెల 8 నుంచి సర్వదర్శనం టికెట్లను తిరుపతిలో జారీచేస్తోంది. ప్రయోగాత్మకంగా తొలుత రోజుకు 2 వేల టికెట్లను జారీ చేసిన తితిదే.. తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా టికెట్ల సంఖ్యను రోజుకు 8 వేలకు పెంచింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సర్వదర్శనం టికెట్ల కోసం వస్తున్న భక్తుల సంఖ్య పెరగడం...రద్దీ అధికమవడంతో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయం తెలియని భక్తులు తిరుపతికి చేరుకొని సర్వదర్శనం టోకెన్ల కోసం నిరసనకు దిగారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో లేవని ఆందోళన చేపట్టారు.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడంపై భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు, తెలంగాణ నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. తొలుత రోజుకు 8 వేల టికెట్లు కేటాయిస్తామని తితిదే ప్రకటించింది...అయితే ఉన్నట్లుండి ఆ టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని చెప్పడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా తితిదే రోజుకో నిర్ణయం తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రోజుకో నిర్ణయం తీసుకుని తితిదే తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని భక్తులు వాపోతున్నారు. రెండు రోజుల పాటు ప్రయాణం చేసి తిరుపతి చేరుకొన్నామని చెబుతున్నాారు. ఎంతో ఆశగా శ్రీవారి దర్శనానికి వచ్చిన తమకు సర్వదర్శనం టోకెన్లు లేవంటూ పోలీసులను పెట్టి తరిమేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వెబ్‌సైట్‌లో కూడా సాంకేతిక సమస్య సైతం వేధిస్తోందని వాపోతున్నారు.
పెరటాసి మాసం కావడంతో అటు తమిళనాడు భక్తులు భారీగా తరలివస్తున్నారు....తిరుమల శనివారాల పేరుతో ఇటు చిత్తూరు జిల్లా భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇదీ చదవండి : TTD: తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. ఆగిన టికెట్ల బుకింగ్