జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచి సరఫరా చేయడానికి మూడు రిఫ్రిజిరేటర్లు సోమవారం చిత్తూరుకు చేరాయి. వీటిని వైద్యాధికారులు పరిశీలించారు. 275 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ రిఫ్రిజిరేటర్లలో సుమారు 60 వేల డోసుల టీకాలను నిల్వ ఉంచవచ్ఛు వ్యాకిన్‌ను చిత్తూరులో భద్రపరిచి సెషన్ కేంద్రాలు, ఆపై పీహెచ్‌సీలకు అందించనున్నారు. సంబంధిత వైద్యాధికారులు స్థానికంగా ఉన్న డీ ఫ్రీజర్‌లో ఉంచి ప్రజలకు దశల వారీగా అందించనున్నారు.
తిరుపతి, చిత్తూరు వైద్యవిభాగం
జిల్లా పరిధిలో తొలి దశలో 35,296 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 145 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత మరో పది కేంద్రాలను పెంచి 155 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు 3,686 మంది వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉంచారు. మరోవైపు వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుయా ఆసుపత్రిలో పీడియాట్రిక్స్ భవనాన్ని ఆనుకుని ఉన్న పెద్దగదిని ఎంపిక చేశారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్తూరులో మూడు ఐఎల్‌ఆర్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి వ్యాక్సిన్లు వస్తే ముందుగా అక్కడ నిల్వ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ చేసే కేంద్రాల్లోనూ రిఫ్రిజిరేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఏర్పాట్లు పూర్తి..
మరోవైపు తొలి దశలో 5వేల డోసులు జిల్లాకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో ఇవి వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా 29 కేంద్రాల్లో ఈ ప్రక్రియ పారరభించే వీలుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఒకవేళ అన్ని కేంద్రాల్లోనూ చేపట్టాలన్నా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. రెండు సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందులో ఏ వ్యాక్సిన్ పంపిణీ చేస్తారనే దానిపై ఇంకా సమాచారం రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు సిద్ధమైనట్లు అధికారులు వెల్లడించారు.
నేటిలోగా పేర్లు నమోదు చేసుకోవాలి
కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని ఈ నెల 16న మొదటి విడతగా హెల్త్ కేర్ కార్యకర్తలకు అందించనున్నామని డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వైద్యాధికారులు, ఇతర శాఖల అధికారులతో మాట్లాడారు. మొదటి విడతలో టీకా పొందనున్న వారంతా తమ పేర్లను మంగళవారం లోపు కొ-విన్-మై-యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. రెండో విడతలో పోలీసు, రెవెన్యూ, నగరపాలక, పంచాయతీరాజ్ శాఖలోని ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు అందించనున్నామని, వారి పేర్లను మండల అధికారుల ద్వారా వైద్యాధికారులు సేకరించి, కొ.విన్‌యాప్ డియోసైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. మూడో విడతలో 50 సంవత్సరాలు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి వివరాలు సేకరించాలని చెప్పారు.
జిల్లాకు చేరిన మూడు రిఫ్రిజిరేటర్లు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా టీకా పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ కేంద్రాలతోపాటు సిబ్బంది నియామకాన్ని పూర్తి చేశారు. 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ముందుగా ఒక్క రోజు చేపట్టిన తర్వాత నిరంతరం కొనసాగుతుందా లేదా అనే అంశంపై అధికారులకు స్పష్టత రాలేదు. అయినా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పనుల్లో జాప్యం.. అనేక ప్రమాదాలకు మూల కారణం