ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుచేయాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా.. చిత్తూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు అమలుకావడంలేదు. ఇటీవల చెక్‌పోస్టు వద్ద లంచం తీసుకుంటూ ఓ హెడ్ కానిస్టేబుల్, స్టేషన్ బెయిల్ మంజూరు చేసినందుకు రూ.10వేలు తీసుకుంటూ ఓ ఏఎస్సై అనిశాకు అడ్డంగా దొరికాడు. ఇలా చెప్పుకొంటూ పోతే అవినీతి సంఘటనలు కోకొల్లలు. ‘100కు కొడితే పోలీసులు రావడంలేదు.. రూ.100 కొడితేనే వస్తున్నారు’ ఇదీ ఓ సినిమాలోని డైలాగ్.. ప్రస్తుతం జిల్లాలో ఇదే దుస్థితి నెలకొంది. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ గడప తొక్కుతారు. ప్రస్తుతం పలువురు సిబ్బంది వ్యవహారశైలి కారణంగా స్టేషన్‌కు వెళితే డబ్బులు పోగొట్టుకోవడంతోపాటు అన్యాయం జరుగుతుందనే భావన నెలకొంది. దీంతో బాధితులు ఠాణా మెట్లెక్కాలంటేనే ఠారెత్తిపోతున్నారు. కొందరు సిబ్బంది ప్రవర్తన మొత్తం పోలీసు శాఖకే మాయని మచ్చగా మిగులుతోంది.
*కొందరు పోలీసులు సాహసోపేతంగా పని చేసి జిల్లా పోలీసు ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేయగా.. కొందరు మాత్రం కళంకం తెస్తున్నారు.
*తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న తడుకుపేట చెక్‌పోస్టు వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్, నలుగురు ఎస్పీవోలను పోలీసులే అరెస్టు చేశారు.
*కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 7న స్నేహితుడితో కలిసి పిచ్చాటూరు నుంచి వెళ్లుతుండగా వడమాలపేట బైపాస్ రోడ్డులో ముగ్గురు పోలీసులు, మరో ఇద్దరు స్నేహితులు కారును ఆపి వారి నుంచి మూడు చరవాణులు, రూ.7వేల నగదు లాక్కున్నారు. ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లల్లో ఒకరు జిల్లాకు చెందిన వారు.
*గత నెలలో తిరుపతిలోని ఓ బిల్డర్‌ను కొందరు కిడ్నాప్ చేసి అతని బంధువుల నుంచి రూ.4 లక్షలు, అతని నుంచి బంగారు గొలుసు, ఉంగరంతోపాటు ఇంట్లోని 300 గ్రాముల బంగారాన్ని కూడా దోచుకున్నారు. ఆ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని కోరగా స్టేషన్ సిబ్బంది రూ.లక్ష డిమాండ్ చేశారు. కిడ్నాపర్లపై చిన్న కేసు పెట్టి.. గొలుసు, ఉంగరాన్ని మాత్రమే రికవరీ చేసినట్లు చూపారు.
తిరునగరిలో పంచాయితీల హోరు
తిరుపతి నగరంలో కొందరు ఖాకీలు ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నారు. ప్రధానంగా భూ ఆక్రమణల విషయంలో ఆక్రమణదారుల పక్షం వహిస్తూ.. సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఓ స్టేషన్‌పై ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటం.. అధికారి తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తంకావడంతో ఆయన్ని మరో స్టేషన్‌కు మర్చారు. ఓ ఠాణాలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ.. పట్టుబడిన ట్రాక్టర్లను వదలాలన్నా రూ.5వేలు సమర్పించుకోవాల్సిందేనని బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయమై కానిస్టేబుల్‌ను బదిలీ చేసినా.. మిగతా సిబ్బందిలో భయంలేదు. చివరకు భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినా సర్దుబాటు చేయడానికి కూడా డబ్బులు అడుగుతున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి ఇటీవల కఠినంగా వ్యవహరిస్తుండటంతో కొందరు ఖాకీలు కొంత వెనక్కు తగ్గారు.
పెట్రోలింగ్ విధులంటే పండుగే
మరోవైపు రాత్రి పూట నిర్వహించే పెట్రోలింగ్ విధుల కోసం కొందరు పైరవీలు చేస్తున్నారు. మండల సరిహద్దుకు ఆవల పోలీసు వాహనం నిలిపి.. వచ్చేపోయే వాహనాలను ఆపుతూ రూ.20 కూడా వసూలు చేస్తున్నారు. వాహనదారుడు ప్రశ్నిస్తే.. వాహన పత్రాలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల ఇటువంటి వారిపై పోలీసు బాసులు దృష్టి సారించి.. కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టులు చేయించారు. ఈ తరహాలోనే వ్యవహరిస్తున్న మిగతా ఇంటి దొంగల పని పడితే.. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం
దిగువ స్థాయి సిబ్బందిలో వ్యక్తిగత క్రమశిక్షణ, నైతికతను పెంచడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యశాల (వర్క్‌షాప్)లో భాగంగా జిల్లాలోని సబ్ డివిజన్లలోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు ఏవైనా సమస్యలపై పోలీసు స్టేషన్లకు వచ్చినప్పుడు వారితో ఎలా మెలగాలి? శాఖ తరఫున ఎటువంటి భరోసా కల్పించాలనే అంశంపై కార్యశాలలో చర్చించాం. తరచూ డీఎస్పీ, ఆపై స్థాయి అధికారులు సిబ్బంది వ్యవహారశైలిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా శాఖాపరమైన చర్యలు తప్పవనే విషయాన్ని స్పష్టం చేశాం. - సెంథిల్‌కుమార్, చిత్తూరు ఎస్పీ
ఇదీ చదవండి