POLICE BATON CHARGE ON TDP ACTIVISTS :ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో కొందరు పోలీసులు బుధవారం అరాచకం సృష్టించారు. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దులోని జేబీ కొత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వస్తున్న ఆ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అధికార వైసీపీకు వత్తాసు పలుకుతున్న పోలీసులు చంద్రబాబును చూసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడమేంటని గడ్డివానికొత్తూరులో టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వాగ్వాదానికి దిగిన మహిళలపై తమ ప్రతాపం చూపటంతో పాటు అసభ్యంగా దూషించడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు.
లాఠీఛార్జిలో శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్యామల, కార్యకర్త హరి, మహిళా కార్యకర్త పవుళారాణి గాయపడ్డారు. శ్యామల కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో స్థానికులు సపర్యలు చేశారు. గతేడాది ఆగస్టులో కుప్పం పర్యటనలో భాగంగా తొలిరోజు రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు పర్యటనకు ముందు వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి గాయపరిచారు. వైసీపీ వారిని వదిలేసి 74 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెట్టి, 8 మందిని అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలుకు పంపడం కలకలం సృష్టించింది. తాజాగా బుధవారం అధికార పార్టీ కార్యకర్తలు మిన్నకుండిపోగా ఆ పాత్రను పోలీసులు పోషించారని తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పేరు చెప్పి, టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు లాఠీలకు పనిచెప్పడంతో వారు తిరగబడ్డారు. దీంతో ఒకరిద్దరు పోలీసులకూ గాయాలయ్యాయి.
ఉదయమే ప్రచార రథాల స్వాధీనం
కుప్పం నియోజకవర్గంలో బుధవారం నుంచి చంద్రబాబు మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ఆయన రోడ్ షో, సభలకు అనుమతి లేదంటూ మంగళవారం రాత్రి 10.30 గంటలకు పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని ఎలాగైనా కొనసాగించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ప్రసంగించే పెద్ద ప్రచార రథాన్ని బుధవారం ఉదయం శుభ్రం చేస్తుండగా గుడుపల్లె ఎస్సై రామాంజనేయులు సిబ్బందితో వచ్చి సీజ్ చేశారు.
మరో ప్రచార రథంతోపాటు స్పీకర్లు ఉండే వాహనాన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రచార రథాన్నీ సీజ్ చేశారు. బుధవారం ఉదయం కెనమాకులపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు తొలగించడంతో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల ఆంక్షల నేపథ్యంలో బుధవారం శాంతిపురం మండలం 121.పెద్దూరు, బెండనకుప్పం, గొల్లపల్లి క్రాస్, శివకురుబూరు, శెట్టిపల్లె క్రాస్, కెనమాకులపల్లి, శాంతిపురంలలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పట్టుదల ప్రదర్శించారు. వారిని ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన పోలీసులు కర్ణాటక సరిహద్దు గ్రామమైన జేబీ కొత్తూరుకు వచ్చే మార్గాలన్నింటినీ అష్టదిగ్బంధం చేశారు. గుడుపల్లె, శాంతిపురం మండల కేంద్రాల నుంచి వస్తున్న వారిని బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
గడ్డూరు క్రాస్ వద్ద పోలీసులు ఓ పొక్లెయిన్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టి, పక్కనే పోలీసు వాహనాలూ నిలపడంతో కార్యకర్తలు ముందుకెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. టీడీపీ కార్యకర్తలు బారికేడ్లను నెట్టేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. అనంతరం గొల్లపల్లి క్రాస్ వద్ద బారికేడ్లు అడ్డంగా పెట్టారు. ద్విచక్రవాహనాలను జేబీ కొత్తూరుకు వెళ్లనీయకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ యథేచ్ఛగా రోడ్ షోలు, సభలు నిర్వహించుకుంటున్నప్పుడు తమ అధినేతకు ఈ ఆంక్షలు ఎందుకని కార్యకర్తలు ఎదురుతిరిగారు. పోలీసులు సుమారు 10 నిమిషాలు లాఠీఛార్జి చేశారు.
ఎదురుతిరిగిన కార్యకర్తల కాళ్లు, తలలపై లాఠీలతో బాదారు. ఇదేంటని ప్రశ్నించిన శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడిపైనా లాఠీ ఎత్తారు. మరో కార్యకర్త హరి ముఖంపైనా గాయాలయ్యాయి. ఓ ఎస్సై, కొందరు పోలీసులు.. కార్యకర్తలను నెట్టుకుంటూ సమీపంలోని పొక్లెయిన్ వద్దకు వచ్చారు. అక్కడా లాఠీలకు పనిచెప్పడంతో శాంతిపురం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్యామల స్పృహ తప్పి పడిపోయారు. మరో అయిదుగురు కార్యకర్తలకూ గాయాలయ్యాయని నాయకులు పేర్కొన్నారు.
పుంగనూరు అర్బన్ ఎస్సై అత్యుత్సాహం
గొల్లపల్లి క్రాస్ వద్ద తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన మహిళలపై పుంగనూరు అర్బన్ ఎస్సై అశోక్‌కుమార్ అసభ్యంగా మాట్లాడారు. పెద్ద కర్ర ఒకటి తీసుకొస్తే వీరందరి పని చెబుతానంటూ హూంకరించారు.
గంటపాటు నడిరోడ్డుపైనే చంద్రబాబు
బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శాంతిపురం మండలానికి చంద్రబాబు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయన కర్ణాటక- ఆంధ్ర సరిహద్దులోని జేబీకొత్తూరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మహిళలు ఆయనకు హారతులిచ్చారు. టీడీపీ కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. సాయంత్రం 4.30 గంటలకు షెడ్యూల్‌లోని తొలి గ్రామమైన 121.పెద్దూరుకు వచ్చారు. అక్కడి నుంచి చంద్రబాబును ముందుకు కదలనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 500 మీటర్ల మేర రోడ్డు మొత్తం వాహనాలను నిలిపేశారు. టీడీపీ అధినేత అక్కడకు రాగానే పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, దిశ డీఎస్పీ బాబు ప్రసాద్ వచ్చి రోడ్ షోలు, సభలకు అనుమతి లేదంటూ నోటీసులిచ్చారు.
ఏఎస్పీ జగదీష్ సహా దాదాపు 500 మంది పోలీసులు 121.పెద్దూరులోనే మోహరించారు. చంద్రబాబు వాహనం ముందుకు వెళ్లకుండా రోప్ పార్టీ ఏర్పాటు చేయడంతో సుమారు గంటపాటు ఆయన నడిరోడ్డుపైనే ఉన్నారు. అక్కడే ప్రజలతో మాట్లాడారు. ప్రచార రథానికి అనుమతివ్వాలని ఆయన కోరినా పోలీసులు అంగీకరించలేదు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలని డీఎస్పీ సూచిస్తున్నారని.. ఇదెక్కడి పద్ధతో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఏ చట్టం కింద నన్ను రానివ్వరని, సొంత నియోజకవర్గ ప్రజలను కలవనివ్వరని ప్రశ్నించారు.
సభలు, సమావేశాలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వబోమని లిఖితపూర్వకంగా రాసివ్వాలని చంద్రబాబు కోరగా పోలీసులు సమాధానం చెప్పలేదు. చివరకు టీడీపీ అధినేత ఓ మైక్ పట్టుకుని ప్రసంగించగా ప్రజలకు వినపడేందుకు ఓ చిన్న స్పీకర్‌ను కార్యకర్త నెత్తిన పెట్టుకున్నారు. గంగవరం ఎస్సై ఈ ప్రసంగాన్ని చిత్రీకరిస్తుండగా.. కేసులు నమోదు చేయడానికి ఫోన్‌లో వీడియో తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఆయన దగ్గరకు వెళ్లారు.
ఇవీ చదవండి: