రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వేరుసెనగ విత్తనకాయల పంపిణీ కొన్నిచోట్ల ఘర్షణలకు దారితీసింది. సచివాలయాల్లో రైతుల పేర్ల నమోదు, అక్కడే విత్తన పంపిణీ ప్రారంభించినా.. అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. గరిష్ఠంగా 4బస్తాల విత్తన వేరుసెనగ కాయ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా అనంతపురంలో మూడు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల ఒక బస్తాకు మించి ఇవ్వడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొడవళ్లతో నరుక్కున్న వైకాపా నాయకులు
వేరుసెనగ విత్తనకాయ బస్తాలు తమకు ఇవ్వాలంటే... తమకే ఇవ్వాలని... ఇద్దరు వైకాపా నాయకులు కొడవళ్లతో నరుక్కుని గాయపడ్డారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం అగ్రహారం పంచాయతీ యనుములవారిపల్లెలో శనివారం ఈ ఘటన జరిగింది. అధికారుల సమక్షంలో విత్తనాల పంపిణీ చేస్తుండగా స్థానిక నేతలైన జయరామిరెడ్డి, శ్రీరాములురాజు ఇరువురు తమవారికే అధికంగా బస్తాలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇరువురి మధ్య వాదన పెరిగింది. వారు తమ అనుచరులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కొడవళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శ్రీరాములురాజు తలకు కొడవలి వేటు పడగా తీవ్రగాయమైంది. జయరామిరెడ్డి నుదురు, మిగతాచోట్ల కొడవలి వేట్లు పడి గాయపడ్డారు.చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.
- పాసుపుస్తకంపై ఎన్ని ఎకరాలున్నా.. ఒకటే బస్తా ఇస్తున్నారు. కౌలు రైతులకు ఇవ్వడం లేదు. ఆరెకరాలకు ఒకటే ఇస్తే ఎలా సరిపోతాయని కొందరు వాపోతున్నారు. రాయితీపై ఒకటే ఇస్తాం, పూర్తి ధర చెల్లించి మా దగ్గరే మిగతావి కొనుగోలు చేయండని చెబుతున్నారని విజయనగరం జిల్లా పినవేమిలి రైతు ప్రసాద్ ఆవేదన వెలిబుచ్చారు.
అందరికీ విత్తనాలిస్తాం
రాష్ట్రంలో ఈ ఏడాది 5.07 లక్షల వేరుసెనగ విత్తనాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే లక్ష క్వింటాళ్ల పంపిణీ పూర్తయిందని ఏపీసీడ్స్ ఎండీ జి.శేఖర్‌బాబు వివరించారు. అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు.
ఇవీ చదవండి