వందే భారత్ మిషన్‌లో భాగంగా ఈరోజు ఉదయం కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 149 ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. మొత్తం 150 మంది ఉండగా, ఒకరు హైదరాబాద్‌లో దిగారు. మిగిలిన 149 మంది రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా జిల్లా సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం చేరుకున్న ప్రవాసాంధ్రులకు అధికారులు కొవిడ్ నిబంధనలు మేరకు భౌతిక దూరం పాటిస్తూ 20 మంది చొప్పున అనుమతించారు. అనంతరం సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు పూర్తిచేసి అధికారులకు అందించారు.
క్వారెంటైన్ సదుపాయం..
చిత్తూరు జిల్లాకు చెందిన 7గురితో పాటు చెన్నై ఒకరు, అనంతపురం ఇద్దరు, కర్నూలు ఒకరికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోనే క్వారెంటైన్ సదుపాయం కల్పించారు. అలాగే ఇతరలను సొంత జిల్లాలకు తరలించడానికి ఆర్టీసీ అధికారులు విమానాశ్రయం నుంచి కడప, వైజాగ్ మార్గాల్లో బస్సులను ఏర్పాటు చేశారు.
అత్యధికం కడపకే
వైజాగ్ మార్గంలో వెళ్లే బస్సులో తూర్పు గోదావరి 6, కృష్ణ 1, నెల్లూరు 6, వైజాగ్ 4, పశ్చిమ గోదావరి 5 మంది మొత్తం 22 మంది ఆర్టీసీ బస్సులలో బయలుదేరారు. అత్యధికంగా కడప జిల్లాకు 4 బస్సులు ద్వారా 116 మంది తరలివెళ్లారు.
ప్రతి బస్సులలో పోలీసు ఎస్కార్ట్‌తో భద్రత ప్రయాణం ఏర్పాటు చేశారు. వీరందరికీ 14 రోజుల క్యారెంటైన్ ఏర్పాటు చేసి వైద్య అధికారులు స్వాబ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: చేనేత బతుకులపై లాక్‌డౌన్ పిడుగు