పరిశ్రమల స్థాపనకు రిజర్వు చేసిన, ఏళ్ల కిందట గిరిజనులకు పంపిణీ చేసిన భూములను కొందరు అధికార వైకాపా నేతలు అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమిత భూముల విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని రైతులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన 20 మంది గిరిజనులకు రెండు దశాబ్దాల కిందట ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. సర్వే నంబర్లు 193/3, 4, 5, 6, 7, 8, 412/3, 4, 7, 10, 11, 12, 413/6, 7, 8, 9, 10, 11, 12లలో సుమారు 20 ఎకరాలు అక్కడి 20 మంది గిరిజనులకు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించని సమయంలో గుత్తకు ఇచ్చి లబ్ధి పొందుతున్నారు. ఈ సారి అక్కడి వైకాపా నేత ఇక్కడి పొలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన భూస్వాములకు అప్పచెప్పడంతో ఎంచక్కా వాళ్లు దున్నుకుంటున్నారు. ఇదేమని అడిగితే సమాధానం లేదని, రెవెన్యూ అధికారులకు గతంలో ఫిర్యాదు చేస్తే అప్పుడు వచ్చి పనులు నిలుపుదల చేశారని, మళ్లీ యథాప్రకారం భూములను దున్నేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
అనాధీన భూముల్లోనూ అక్రమం
గిరిజనుల భూములకు సమీపంలో ఉన్న పరిశ్రమలకు రిజర్వు చేసిన బ్లాక్ నంబరు 193లోని పొలాల్లో వంద ఎకరాలకు పైగా దున్నేశారు. వీటి విలువ రూ.10 కోట్లు పైనే. క్రమేణా ఇక్కడి భూములన్నింటినీ దశల వారీగా స్థానికేతరులకు అప్పజెప్పేయత్నాలు జోరందుకున్నాయి. వీరి వెనుక అధికార పార్టీ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం.
పనులు నిలిపిస్తాం
గిరిజనుల భూములతో పాటు అక్కడి అనాధీన భూముల్లో ట్రాక్టర్లతో దున్నుతున్నట్లు సమాచారం అందింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దున్నడాన్ని సహించం. అక్కడకు అధికారులను పంపుతాం. గిరిజనులకు అన్యాయం జరగనీయం. - జరీనాబేగం, తహసీల్దార్, శ్రీకాళహస్తి
ఇదీ చదవండి: అన్లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి