Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 16వ రోజు చేపట్టిన పాదయాత్ర 17.7 కిలోమీటర్లు సాగింది. జిడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం విడిది కేంద్రం నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఎస్ఆర్ పురం హనుమాన్ ఆలయం, పుల్లూరు క్రాస్, దిగువ మెడవడ ఎస్టీ కాలనీ, పిల్లారి కుప్పం క్రాస్, మూలూరు, వెంకటాపురం, చిలమకూలపల్లె, ఉడమలకుర్తి, కఠారిపల్లి జంక్షన్, కొత్తూరు విడిది కేంద్రం వరకు నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదవ సామాజిక వర్గం నేతలను, బెంగుళూరులో స్థిరపడిన జిడి నెల్లూరు వ్యాపారులతో సమావేశం అయ్యారు. అనంతరం ఎస్ ఆర్ పురం హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాదయాత్రలో భాగంగా జిడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కత్తెరపల్లి కూడలి లో యువనేత పాదయాత్ర 200 కిలోమీటర్లు చేరుకోగానే... కార్యకర్తలు లోకేష్ పై పూలవర్షం కురిపించారు. పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేశారు. యువగళం జైత్రయాత్ర 200 కిలోమీటర్లు చేరుకున్నందుకు గుర్తుగా తెదేపా శ్రేణులు ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
పాదయాత్రలో భాగంగా ఎస్ ఆర్ పురం పుల్లూరు క్రాస్ లో ప్రజలనుద్దేశించి మాట్లడబోతున్న లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మైక్ ను పోలీసులు లాక్కోవడంతో అక్కడికి ప్రజల్ని నిశబ్ధంగా ఉండమని మైక్ లేకుండానే లోకేశ్ మాట్లడారు. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చెయ్యడం ఆపి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో వైఎస్, జగన్ పాదయాత్ర లని ఏనాడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. తాను టెర్రరిస్టుని కాదని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. జగన్ లాగా దేశాన్ని దోచుకొని నేను జైలుకి వెళ్ళలేదని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పై పోరాడటానికి ప్రజల్లోకి వచ్చానన్నారు. గతంలో ఐఎఎస్ లను మాత్రమే జైలుకి తీసుకెళ్ళిన జగన్ ఇప్పుడు ఐపిఎస్ లను కూడా జైలుకి తీసుకుపోతాడన్నారు. మహిళలు, యువత, రైతులకు జగన్ చేసిన అన్యాయాల పై తన పోరాటం ఆగదన్నారు. వైసీపీ వాళ్ళకి అమలు కానీ జీఓ 1 తనకే ఎందుకు అమలవుతోందని ప్రశ్నించారు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ఎస్ ఆర్ పురం విడిది కేంద్రంలో యాదవ సామాజికవర్గీయులు, బెంగుళూరులో స్థిరపడిన జిడి నెల్లూరు వ్యాపారులతో లోకేష్ భేటీ అయ్యారు. సైకో పోయి... సైకిల్ వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. బెదిరింపులు, వేధింపులు లేని సైకిల్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉన్న వనరుల ఆధారంగా ఏ జిల్లాకు ఏ పరిశ్రమలు అవసరమో మా దగ్గర పక్కా ప్రణాళిక ఉందని... స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
వైసీపీ పాలనలో యాదవులు ఆర్థికంగా చితికి పోయారన్నారు. గొర్రెలు, మేకలు కొనడానికి సబ్సిడీలో రుణాలు అందక... పశువుల మేతకు ఉపయోగించే భూమిని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డిది ఫ్యాక్షన్ మనస్థత్వమని...యాదవులు ఆర్ధికంగా బలపడితే తన మాట వినరు అనే ఆలోచనతోనే మీకు తీరని అన్యాయం చేశాడని తెలిపారు. తెదేపా హయంలో యాదవులకు పెద్దపీట వేశామని... జగన్ రెడ్డి చుట్టూ తన సొంత సామాజిక వర్గం వారున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా రాత్రికి కొత్తూరు విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్ రాత్రికి అక్కడే బస చేశారు.
ఇవీ చదవండి: