పెద్దమండ్యం మండలం చెరువుముందరపల్లికి చెందిన బాలసుబ్రహ్మణ్యంకు 11 సంవత్సరాల కిందట మదనపల్లెకు చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. గిఫ్ట్ సెంటర్ నిర్వహించే ఇతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది. తిరుపతికి వెళ్లి ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 10 రోజుల కిందట మదనపల్లికి వచ్చిన ఆయనను... రేణుక ఆమె ప్రియుడితో కలిసి పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి లారీతో ఢీ కొట్టించి హత్య చేయించింది.
తనకు అనారోగ్యంగా ఉందని.. మందులు తీసుకురావాలని భర్తను ద్విచక్రవాహనంపై పట్టణానికి పంపింది రేణుక. అప్పటికే తన ప్రియుడు నాగిరెడ్డికి సమాచారమిచ్చి... ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నీరుగట్టువారిపల్లెలో లారీతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించారు. మొదట పోలీసులు రోడ్డు ప్రమాదంగా గుర్తించి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తన తమ్ముడి మృతిపై అనుమానాలున్నాయని బాలసుబ్రహ్మణ్యం సోదరుడు రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా... ప్రమాదానికి గురి చేసిన లారీని వాల్మీకిపురం వద్ద పట్టుకున్నారు. విచారణలో మృతుడి భార్య, ఆమె ప్రియుడు మరికొంతమంది కలిసి లారీతో ఢీకొట్టి చంపిన వైనం వెలుగుచూసింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండీ... 'ప్రతి జిల్లాలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి'