తాజా ఎన్నికల్లో విజయం సాధించి... ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ తొలిసారి కలియుగ వైకుంఠనాధుణ్ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన మోదీకి... పద్మావతి అతిథిగృహం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్న ప్రధానికి మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. మూలమూర్తిని, విమాన వేంకటేశ్వరస్వామిని, వకుళామాతను దర్శించుకున్న మోదీ... హుండీలో కానుకలు వేశారు.
అనంతరం సబేరాలో స్వామివారి శేషవస్త్రంతో ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. తర్వాత రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం పలికారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామి వారి చిత్రపటం బహుకరించి... తీర్థప్రసాదాలు అందచేశారు. భక్తులకు అభివాదం చేసుకుంటూ మోదీ ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధాని మోదీ ఆలయంలోకి ప్రవేశించే సమయంలో... రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు... ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు. మోదీ పర్యటన సందర్భంగా కనుమ రహదారులు, తిరుమల పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరుమలకు రాకముందు రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన భాజపా ప్రజా ధన్యవాద సభలో మోదీ పాల్గొన్నారు. ''బాలాజీ పాదపద్మాల సాక్షిగా మళ్లీ నాకు అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు'' అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. ఏపీ అభివృద్ధికి అన్నివిధాల సహకరిస్తానని హామీఇచ్చారు. జగన్‌కు అభినందనలు తెలిపారు. సంక్షేమ పాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పర్యటన ముగించుకొని దిల్లీకి బయలుదేరిన మోదీకి ... గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ వీడ్కోలు పలికారు.
ఇదీ చదవండీ...