Mango Farmers Problems: ప్రకృతి ప్రకోపాలను సైతం తట్టుకోగలుగుతున్న మామిడి రైతులు.. సర్కారు కొట్టే దెబ్బలకు విలవిల్లాడిపోతున్నారు. బీమా లేక.. కవర్లపై రాయితీ రాక.. గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. చీడపీడలను నివారించే వ్యవస్థ, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంలోని మామిడి రైతులు దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఒకపక్క మంగు ప్రభావం, మరోపక్క గాలివానల బీభత్సం.. మామిడి రైతుల్ని దారుణంగా దెబ్బతీశాయి. అయినా తట్టుకుని ఉన్నంతలో చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడులు సాధించారు. సకాలంలో అండగా నిలబడాల్సిన సర్కారు మాత్రం చేతులెత్తేసి.. రైతుల్ని గాలివానలకు వదిలేసింది. మూడేళ్ల కిందటి వరకు మామిడికి ఉన్న బీమాను ఎత్తేసి, వారిని చావుదెబ్బ కొట్టిన సర్కారు.. మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులివ్వడం మానేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ తోతాపురి సాగు ఎక్కువ. దీనిమీద ఆధారపడి 39 వరకు గుజ్జు పరిశ్రమలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మామిడి గుజ్జు పరిశ్రమ ఉందని, ఆయన అండతోనే వ్యాపారులు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. తోతాపురి రకానికి టన్నుకు 10 వేల నుంచి 12 వేల రూపాయలే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి టన్నుకు 19 వేలు ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆ తర్వాత 15 వేలు రూపాయలకు తగ్గించారు. ఆ ధరకు కూడా వ్యాపారులు కొనడం లేదు. గుజ్జు పరిశ్రమకు తీసుకెళ్తే టన్నుకు 11 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మామిడి రైతులు వాపోతున్నారు.
రైతులు ఎంతో కష్టపడి దిగుబడి సాధిస్తే అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. చీడపీడల ఉద్ధృతి కూడా పెరుగుతోంది. తామర పురుగు, పండు ఈగ కాయల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది కూడా కొన్ని జిల్లాల్లో ఎకరాకు సగటున 4 టన్నుల దిగుబడి లభిస్తుండగా.. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల టన్ను కూడా రాని పరిస్థితులున్నాయి. సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో విజయనగరం జిల్లా నుంచి సువర్ణరేఖ రకం ఎగుమతులు జోరుగా సాగేవి. ఈ ఏడాది మందగించాయి. సీజన్ ఆరంభంలో టన్ను 90 వేలకు పైగా పలికిన బంగినపల్లి రకం తర్వాత క్రమంగా తగ్గుతూ 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది.
మామిడి పంటను 2019లో బీమా నుంచి తప్పించింది. గత రెండేళ్లలో వేలాదిమంది రైతులు భారీగా నష్టపోయారు. ఏటా సగటున ఎకరాకు 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు కోల్పోయారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. ఎలాంటి భరోసానూ ఇవ్వలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి. ముఖ్యంగా కౌలుకు తీసుకున్న రైతులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. పంటల బీమా ఉంటే కొంతైనా గట్టెక్కేవారమని రైతులు అంటున్నారు. గతంలో మామిడి రైతులకు ప్రభుత్వం 50%, 70% రాయితీపై కవర్లను సరఫరా చేసేది. వాటి వల్ల ఎకరాకు సగటున టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి, టన్నుకు 20 వేల వరకు అదనంగా ఆదాయం దక్కేది. కానీ.. ఖజానా ఖాళీ అయిపోయిందనో.. మరే కారణమో.. రాష్ట్ర ప్రణాళిక కింద కవర్లకు ఇచ్చే రాయితీ నిలిపేసింది. దీంతో ఎకరాకు 30వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతన్నలు వాపోతున్నారు.
కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో బంగినపల్లి సాగు అధికం. ఈ రకం మామిడికి విదేశాల్లో అధిక డిమాండు ఉన్నా అందిపుచ్చుకోవడంలో సర్కారు విఫలమవుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతులు ఎక్కువ. విజయనగరంలో సాగయ్యే సువర్ణరేఖపై దక్షిణ కొరియా వ్యాపారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.గతంలో మామిడి పంట చేతికొచ్చే సమయానికి రైతులు, వ్యాపారులతో ప్రభుత్వం సదస్సులు నిర్వహించేది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో మొక్కుబడిగా ఒకటి రెండు సదస్సులు నిర్వహించినా.. వాటివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నా.. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కొరవడిందంటున్నారు. కొత్తగా ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నా.. సర్కారు నుంచి మాత్రం ఏమాత్రం సహకారం అందటంలేదని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: