ఈనెల ఆరో తేదీన ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి అన్ని వస్తువులను శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
సాధారణంగా శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం వంటి పవిత్ర రోజుల్లో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇదీచదవండి.