కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో కార్తిక వనభోజన మహోత్సవాన్ని తితిదే ఘనంగా నిర్వహించింది. గజవాహనంపై ఆలయం నుంచి శ్రీవారు బయలుదేరగా మరో పల్లకిలో శ్రీదేవి, భూదేవి అమ్మవారు పాపవినాశనం రహదారిలోని పార్వేట మంటపానికి చేరుకున్నారు. స్వామి, అమ్మవార్ల ఊరేగింపు మంగళ వాద్యాలు, మహిళల కోలాటాలు, భజన బృందాల నృత్యాల మధ్య కోలాహలంగా సాగింది.
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం
సుందరంగా అలంకరించిన పార్వేట మంటపంలో శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవరులకు అభిషేకం చేశారు. దూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అన్నమయ్య కళాకారులచే భక్తి సంకీర్తనా కచేరీని నిర్వహించారు.
భారీగా భక్తజనం రాక
వనభోజనోత్సవంలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు ఉసిరి చెట్టు కింద దీపారాదన చేశారు. అనంతరం తితిదే ఏర్పాటు చేసిన సామూహిక వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఆరగించారు. తర్వాత పార్వేట మంటపం నుంచి తిరిగి స్వామి వారు, అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.