తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రంలో ముగిసేట్లుగా తితిదే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. శ్రీవారి ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును "అభిద్యేయక అభిషేకం" అని వ్యవహరిస్తుంటారు. తరతరాలుగా చేస్తున్న అభిషేకాలతో... అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఏటా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు.
జ్యేష్టాభిషేకంలో భాగంగా మొదటిరోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి విహరింపజేస్తారు. మూడో రోజు ఉత్సవ వరులకు తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి మళ్లీ ఊరేగిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు శ్రీవారు స్వర్ణ కవచంతోనే ఉంటారు.
ఇదీ చదవండి:
Piyush Goyal: తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్