Illegal Cases Against TDP Sympathizers in Punganur Constituency: ఇంటి పెద్ద ఒక్క రోజు కనిపించకపోతే కుదురుగా ఉండలేం. అన్నం ముట్టలేం.. కానీ పుంగనూరు నియోజకవర్గంలోని అనేక ఇళ్లలో.. ఇంటిపెద్ద ఆచూకీ లేక వారం దాటింది. ఇంటాయన కోసం ఎదురుచూస్తున్న ఇల్లాలు.. కన్నబిడ్డ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్న తల్లిదండ్రులు. నాన్న కావాలని మారాం చేస్తున్న పసి పిల్లలు. ఇవీ పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం సానుభూతిపరుల ఇళ్లలోని ఆక్రందనలు. చంద్రబాబు పర్యటనలో ఘర్షణలపై మాట్లాడదాం రమ్మని కొందరిని.. అర్థరాత్రి నిద్రలేపి మరికొందరిని పోలీసులు ఎత్తుకెళ్లారంటూ.. బాధిత కుటుంబాలు కన్నీటిపర్యంతం అవుతున్నాయి.
కటింగ్ చేసుకుంటానని శనివారం సాయంత్రం వెళ్లాడు. ఇద్దరు పోలీసులు వచ్చి రవి ఎటు వెళ్లాడని అడిగారు. ఎందుకు అని అడిగితే.. చూసి చాలా రోజులయ్యింది. మాట్లాడాలని వచ్చామని చెప్పారు. ఫోన్ చేయమని అడిగితే.. ఫోన్ చేసి ఇచ్చాను. అన్న మీరు తొందరగా రండీ.. ఎస్సై మిమ్మల్ని రమ్మంటున్నాడని చెప్పారు.
ఆగస్టు 4న పుంగనూరు నియోజకవర్గం భీమగానిపల్లె వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల కేసులో.. సింధు భర్త రవిని పోలీసులు తీసుకెళ్లారు. ఎస్ఐ పిలుస్తున్నారంటూ ఆగస్టు 5న క్షౌరశాలలో ఉండగా తీసుకెళ్లారు. అలా వెళ్లిన భర్తను నేటికీ చూడలేదని రోదిస్తున్నారు సింధు. అసలు ఆగస్టు 4న తన భర్త రవి అనారోగ్యంతో ఇంట్లోనే ఉన్నాడని.. సంబంధం లేని కేసులో తీసుకెళ్లడం ఏంటని ఆమె ఆక్రోశిస్తున్నారు. రవి క్షేమ సమాచారం తెలియక తల్లిదండ్రులు రోదిస్తున్నారు. నాన్న ఏడని అడుగుతున్న బిడ్డను ఓదార్చలేక సింధు తల్లతల్లడిల్లుతోంది.
"మా ఇంట్లో పెద్దాయనకు ఆరోగ్యం బాగా లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. ఇంట్లో పిల్లల్ని పట్టుకోవాలి.. పెద్దాయనను ఆసుపత్రికి తీసుకెళ్లే వారు ఎవరు లేరు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. నేను ఆయన్ని ఎక్కడ్నుంచి తీసుకురావాలి. ఒకసారి చూపించండని స్టేషన్ దగ్గరికి వెళ్లిన చూపించటం లేదు." అని ఎమ్మేవారిపల్లి పోలీసులు తీసుకెళ్లిన ఉమాశంకర్ భార్య అనిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె ఆక్రందననూ ఆలకించేవారులేరు.
అనిత తన భర్త ఉమాశంకర్‌తో కలిసి ఈనెల 5న ఊళ్లో నరసింహస్వామికి.. అభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభిషేకానికి పాలకోసం వెళ్లిన ఉమాశంకర్‌ను పోలీసులు తీసుకెళ్లారు. అభిషేకం చేసుకోవాల్సిన అనిత తన భర్తకు ఏమైందోనంటూ ఆర్థ్రతగా స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు కేసు గురించి చెప్పగానే అనిత కంగుతిన్నారు. అసలు తన భర్త చంద్రబాబు పర్యటనకే వెళ్లలేదని ఆగస్టు 4న అభిషేకం సరుకుల కోసం ఇద్దరం సోమల వెళ్లామని.. ఆమె మొత్తుకున్నారు. కానీ అక్కడెవరూ ఆలకించలేదు. వారంనుంచి ఇంటికి పెద్దదిక్కులేక దిక్కుతోచడం లేదన్నది అనిత ఆవేదన.
రొంపిచెర్ల మండలం బెస్తపల్లికి చెందిన వరలక్ష్మి ఇంట్లోనూ అవే కన్నీళ్లు.. వరలక్ష్మి తండ్రి సుందర్నూ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా తీసుకెళ్లారు. అసలు గొడవలు జరిగిన రోజు సుందర్ అక్కడికి వెళ్లలేదని వరలక్ష్మి విలపిస్తున్నారు. సుందర్ భార్య కూడా ఎప్పుడేం వార్తవినాల్సి వస్తుందోనంటూ.. కుమిలిపోతున్నారు.
"ఎప్పటిలాగానే మా నాన్న ఆరుబయట పడుకున్నారు. రాత్రి ఎప్పుడు వచ్చారో ఏమో తెలియదు. తెల్లవారు జామున లేచేసరికి వేరే వాళ్లు వచ్చి చెప్పారు. పోలీసులు తీసుకెళ్లారని తెలిసింది. అల్లర్లకు పోతే ఏ శిక్ష వేసినా బాగుంటుంది. కానీ, పోకుండానే తీసుకెళ్తే ఇంట్లో ఎంత ఇబ్బంది ఉంటుంది." -వరలక్ష్మి, బెస్తపల్లి, పోలీసులు తీసుకెళ్లిన సుందర్ కుమార్తె
పాపిరెడ్డిపల్లికి చెందిన రంగమ్మ మరో గాథ.. ఏంచేయాలో దిక్కుతోచక పెనివిటి ఫొటోకేసి దీనంగా చూస్తోంది. ఈమె భర్త గురప్పనూ ఆగస్టు 6న పోలీసులు తీసుకెళ్లారు. కేసేంటని ఆరా తీస్తే చంద్రబాబు పర్యటనల గొడవ గురించి చెప్పారు. అసలు గొడవ జరిగినరోజు తాము..అక్కడకు వెళ్లలేదని, వంగతోటకు ఎరువు తోలుకుంటున్నామని, అన్యాయంగా తన భర్తను తీసుకెళ్లారని గుండెలు బాదుకుంటున్నారు రంగమ్మ.
వారణాసిపల్లికు చెందిన చెంచు లక్ష్మిదీ అదే అరణ్య రోదన. ఈనెల 5న తెల్లవారుజామున 3 గంటలకు చెంచులక్ష్మి భర్త రాజేంద్రను పోలీసులు తీసుకెళ్లారు. స్టేషన్‌కు వెళ్లి అడిగితే ఏం కాదు వచ్చేస్తారని చెప్పిపంపారు. కానీ.. ఇంత వరకూ ఆచూకీలేదు. కావాలని కేసుల్లో ఇరికించారని, ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదని చెంచులక్ష్మి వాపోతున్నారు.
"నేను తెల్లవారి నిద్రలేసే సరికి మా ఆయన లేరు. ఉదయాన్నే స్టేషన్ దగ్గరికి వెళ్తే వస్తాడని అన్నారు. మా ఆయన అల్లర్లు జరిగిన దగ్గర ఉన్నారని అరెస్టు చేశామని అంటున్నారు. అప్పుడు పోలీసులు ఏం చేశారు. ఇప్పుడు వచ్చి అర్థరాత్రి తీసుకుని వెళ్లారు. అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు కదా.. అప్పుడే అరెస్టు చేయాల్సింది. ఇలా అక్కడ లేని వారిని అరెస్టు చేస్తున్నారు." -చెంచులక్ష్మి, వారణాసివారిపల్లి, పోలీసులు తీసుకెళ్లిన రాజేంద్ర భార్య
భీమగానిపల్లె ఘటనలో మొత్తంగా 246 మందితో పాటు పలువురిని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేశారు. వాళ్లలో ఏ కుటుంబ సభ్యుల్లో.. ఎవర్నీ కదిలించినా కన్నీటి ధారలు ఆగడంలేదు. కొంతమందైతే అక్రమ కేసుల భయంతో ఊరొదిలి వెళ్లిపోయారు. ఎఫ్ఐఆర్లో ‘ఇతరుల’ జాబితాలో ఎక్కడ తమ పేర్లు చేర్చుతారోననే భయంతో ఇళ్లకు తాళాలు వేసి వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కొన్ని గ్రామాలను 'ఈటీవీ భారత్'.. 'ఈనాడు' బృందం పరిశీలించగా గ్రామాల్లో భయాందోళన రాజ్యమేలుతోంది. ఎవర్ని కదిపినా ఎప్పుడు వచ్చి ఎవర్ని తీసుకెళ్లారోని బెదిరిపోతున్నారు. కేసులు నమోదైన గ్రామాల్లోకి కొత్తవారు వస్తే మాట్లాడటానికీ ఎవరూ ముందుకు రావడంలేదు.
అరెస్టు చేసిన వారిలో 81 మందిలో 13 మందిని చిత్తూరు జిల్లా జైలుకు, మిగతా వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. చాలా మంది తమవారిని ఎక్కడ ఉంచారో తెలియక ఆవేదన చెందుతున్నారు. వైసీపీ నాయకుల ఒత్తిడితోనే అల్లర్లు జరిగిన నాడు అక్కడ లేకున్నా తమ వారిని అరెస్టు చేశారని బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి.
తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్నారనే కక్షగట్టి వైసీపీ నాయకులు పోలీసుల ద్వారా వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఏజెంట్లుగా కూర్చోవాలన్నా భయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అదునుగా వైసీపీలో చేరితే కేసులు, అరెస్టులు ఉండవంటూ పరారీలో ఉన్న వ్యక్తులకు అధికార పార్టీ నాయకులు రాయబారం పంపుతున్నారు.
అల్లర్లలో పాల్గొన్నవారెవరో కచ్చితంగా గుర్తించకుండా.. ఆయా గ్రామాల్లోని తెలుగుదేశం సానుభూతిపరుల కుటుంబాల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఐతే ఆగస్టు 4 నాటి వీడియో ఫుటేజీ, టవర్‌డంప్ ఇతర సాంకేతిక అంశాలు పరిశీలించి అన్ని ఆధారాలతోనే అరెస్టులు చేస్తున్నామని.. చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నెల 4న ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 7న మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అందులో పేర్కొన్న ఇతరుల జాబితాలో ఇంకెంతమందిని చేర్చుతారోనని.. తెలుగుదేశం సానుభూతిపరుల కుటుంబాలకు కంటిమీద కునుకు ఉండడం లేదు.