పారిశ్రామికంగా అభవృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాక ఆక్రమణదారులు కన్ను ప్రభుత్వ భూములపై పడింది. నగర శివారు ప్రాంతాలతో పాటు రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి.. తప్పుడు పత్రాలతో తక్కువ ధరలకు విక్రయించేశారు. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో శాశ్వత కట్టడాలు వెలిశాయి.
ఆక్రమణ దారుల నుంచి కాపాడటానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆక్రమణలపై వీఆర్‌ఏల నుంచి సమగ్ర సమాచారం రాదన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ కేంద్రం నుంచి ఉపగ్రహ చిత్రాలను తీసుకున్నారు. వాటితో రెవెన్యూ పత్రాలను సరిపోల్చి ఆక్రమణలను గుర్తిస్తున్నారు. మొదటగా 6 నెలలలోపు జరిగిన ఆక్రమణల తొలగిస్తున్న అధికారులు.. అంతకు ముందు నిర్మాణాలు చేసిన వ్యక్తులకు తాఖీదులు జారీ చేస్తున్నారు. వారం రోజులే సమయమిచ్చి ఇళ్లు కూల్చేస్తున్నందున బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టాభూముల పేరు చెప్పి కొందరు మోసం చేశారని.... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
తిరుపతి నగర శివార్లతో పాటు స్వర్ణముఖి నదితోపాటు పరివాహక ప్రాంతంలోని కబ్జాలపై దృష్టి సారించారు. ఉపగ్రహ చిత్రాలతోపాటు డ్రోన్ల ద్వారా సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆక్రమణలు తొలగిస్తున్న సమయంలో స్థలాలను ఎవరి వద్ద కొనుగోలు చేశారు...ప్రైవేటు భూమిగా చూపి ఎంతమేర వసూలు చేశారన్న అంశాల అధారంగా కబ్జాదారులపై కేసుల నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ప్రభుత్వ స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన వాటిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటున్న అధికారులు కబ్జాదారుల మోసాలతో నష్టపోయిన నిరుపేదలకు న్యాయం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇళ్లు కోల్పోతున్న వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ గృహాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారు. మధ్యవర్తుల మాటలను నమ్మి ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి మోసపోకుండా ఉండేలా చైతన్య పరుస్తున్నారు.