ప్ర: ప్లాస్మా సేకరణ ఏ విధంగా సాగుతుంది? ఎలాంటి రోగుల నుంచి ప్లాస్మాను సేకరిస్తున్నారు?
వెంగమ్మ: కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో... ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ప్లాస్మా సేకరించాలని గైడ్‌లైన్స్ వచ్చాయి. ప్లాస్మాను సేకరించడానికి ఎఫరిసిస్ అనే పరికరం(మెషిన్) ఉంటుంది. ఈ మెషిన్ ప్లాస్మాను రక్తకణాలతో వేరు చేసి.. ఆ తర్వాత మళ్లీ రక్తం సేకరించిన వారి శరీరంలోకి ఎర్ర రక్తకణాలను ప్రవేశింపజేస్తుంది. ఇది 300-450 ఎం.ఎల్ కొలతలో తీస్తుంది.
ప్ర: ప్లాస్మాను తీసుకుని ఎన్ని రోజులు నిల్వ చేసుకునేందుకు వీలు ఉంటుంది?
వెంగమ్మ: సామాన్యంగా ప్లాస్మాను -18 డిగ్రీల్లో సంవత్సరం పాటు నిల్వ చేసుకునేందుకు వీలుంటుంది.
ప్ర: ఎలాంటి రోగాల నివారణకు ప్లాస్మాను వినియోగిస్తారు?
వెంగమ్మ: కరోనా బారిన పడి వెంటిలేటర్ల్పై ఉండే వారికి ప్లాస్మా థెరపీ ఉపయోగపడనుందని భావిస్తున్నాం. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీ టైటర్స్ను బట్టి స్పందన ఉంటుంది. యాంటీబాడీస్ బాగా ఎక్కువగా ఉంటే ఉపయోగపడుతుంది... తక్కువగా ఉంటే ఉపయోగపడకపోవచ్చు. అందువల్ల యాంటీబాడీస్‌ను టెస్టు చేసిన తర్వాత ఉపయోగపడుతుందా? లేదా? అనేది తెలుస్తుంది.
ప్ర: ప్లాస్మాను గతంలో ఏవైనా రోగాలు నివారించడానికి ఉపయోగించారా? కేవలం కరోనా నివారణ కోసమే దీన్ని వాడుతున్నారా?
వెంగమ్మ: న్యూరాలజిలో జీబీ సిండ్రోమ్, న్యూరోమైటిస్ ఆప్టికా వంటి వాటిల్లో ప్లాస్మా ఫెరసిస్ అని ఎఫరిసిస్ అనే మెషిన్‌తో వైద్యం చేస్తున్నాం. జీబీ సిండ్రోమ్, మైస్తీన్, ఎగ్రావీస్, న్యూరోమైలైటిస్ ఆప్టికా, ఆప్టిక్ న్యూరైటిస్ పేషంట్లకు వారి శరీరాల్లోని యాంటీబాడీస్ వాటి సొంత కణాలపైనే పోరాడి దాన్ని నాశనం చేస్తాయి. అందుకని వాళ్లలో ఉండే ప్లాస్మాను తీసేసి ఆరోగ్యంగా ఉన్న వారి ప్లాస్మాను ఎక్కిస్తాం. ఎక్కువశాతం ప్లాస్మాను న్యూరాలజీలో వాడతారు.
ప్లాస్మాను ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో వాడతారు. తమ శరీరంలోని యాంటీబాడీస్ స్వతహాగా వాటి కణాలపైనే పోరాడుతుంది. ఇలాంటి సమయాల్లో యాంటీబాడీస్‌ను తీసేసి ప్లాస్మాను వాడతాం.
ప్ర: స్విమ్స్, రుయా ఆసుపత్రుల నుంచి కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారిలో ఎంతమంది ప్లాస్మాను ఇవ్వటానికి ముందుకు వచ్చారు?
వెంగమ్మ: స్విమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యి 28 రోజులు గడిచిన వారిని సంప్రదిస్తున్నాము. ముందుగా చిత్తూరు జిల్లాలో కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి ఆ తరువాత ఇతర జిల్లాల్లో వారి వద్ద నుంచి కూడా సేకరిస్తాం. ఒక్కో పేషంట్ నుంచి ఎఫెరిసిస్ ద్వారా ప్లాస్మాను సేకరించడానికి రూ.12వేలు ఖర్చవుతుంది. పేషంట్‌కు ఎలాంటి ఖర్చు లేకుండా శ్రీ బాలాజీ ఆర్వీ ప్రసాద్ స్కీమ్ కింద ఎఫరిసిస్ చేస్తాం.