చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పంటపొలాలపై వరుసగా ఏనుగుల దాడులు చేస్తుండడంతో రైతుల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోని పంటలు నాశనం చేస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు నగర శివారులోని 5వ డివిజన్ పరిసర ప్రాంతాలైన సీకే పల్లెలో శనివారం అర్థరాత్రి రెండు ఏనుగులు సంచరించాయి. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి పంటను తొక్కి నాశనం చేశాయి.
ఇప్పటికే కుప్పం, తమిళనాడు, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపులోని.. మూడు ఏనుగులు దారితప్పి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించాయి. చిత్తూరు నగర శివారు ప్రాంతమైన అగ్రహారంలోని పంట పొలాలపై దాడులు చేసిన ఏనుగులు.. అటవీ మార్గం ద్వారా శనివారం అర్ధరాత్రి కొట్రకోణ గ్రామంలోని అరటిపంటలను ధ్వంసం చేశాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడం.. కష్టపడి పండించిన పంటలను ఏనుగులు నాశనం చేయడంతో ఏమిచేయాలో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పంటలకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ అనుమతి