తిరుపతి - శ్రీకాళహస్తి ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్న మాధవమాల గ్రామం ఇది. తమ చేతివృత్తి కళతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారీ గ్రామస్తులు. తాతల కాలం నుంచి వస్తున్న కళనే నమ్ముకుని ఇప్పటికీ ఈ ఊర్లో 85శాతం కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలు, ఉత్సవ వాహనాలు, ఇళ్ల ద్వారబంధాలు వంటివి తయారు చేయడం వీరికి కొట్టినపిండి. గ్రామంలో ఎక్కడ చూసినా, ఈ కళాకారుల ప్రతిభ అబ్బురపరుస్తూనే ఉంటుంది.
ఆశించినంత ఆదాయం లేకున్నా, నచ్చిన పనిని సంతృప్తిగా చేస్తున్నామంటారు మాధవమాల కళాకారులు. వీరు తయారు చేసిన బొమ్మలను ప్రభుత్వ హస్తకళల ఎంపోరియాలకూ తరలిస్తుంటారు. నేటి తరం యువత కూడా.. ఓపక్క చదువుకుంటూనే, మరోపక్క వంశపారంపర్య కళను కూడా నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.పెట్టుబడి, మార్కెటింగ్ విషయాల్లో ప్రభుత్వం చేయూతనందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని కళాకారులు కోరుతున్నారు.