Dravida University Out Sourcing Employees Protest: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ వర్సిటీలో వేతనాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. దక్షిణాది రాష్ట్రాలకు తలమానికంగా.. 26 ఏళ్ల కిందట ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో దాదాపు 250 మంది పొరుగు సేవల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు అందలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేనందున నిరసన బాటపట్టారు. వర్సిటీ ప్రధాన మార్గం వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి సమ్మెకు శ్రీకారం చుట్టారు.
వర్సిటీ ఉద్యోగాన్ని నమ్ముకున్న ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు ప్రతి నెల జీతాలు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించేవరకూ సమ్మెను కొనసాగిస్తామన్నారు. వెంటనే తమకు జీతాలు విడుదల చేసి.. న్యాయం చేయాలన్నారు. సమస్యలు తీర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని.. పొరుగుసేవల ఉద్యోగులు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమ్మెతో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన వర్సిటీ అధికారులు పరీక్షలను నెల రోజులు వాయిదా వేసి విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.
సమ్మె విరమించండి..10లోపు పరిష్కరిస్తా: మూడు నెలలు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు జీతాలు అందలేదని రెండు రోజుల నుంచి నిరసన చేపట్టిన ద్రవిడ విశ్వవిద్యాలయ -బోధనేతర ఉద్యోగులు శుక్రవారం ఉదయం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట సమ్మెలో పాల్గొంటున్న శిబిరం వద్దకు ఎమ్మెల్సీ భరత్తో పాటు వైసీపీ శ్రేణులు చేరుకుని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఓ ఉద్యోగి కలుగజేసుకొని ఇంతకు ముందు ఈసీ(పాలకమండలి సమావేశం) పెట్టించి వారి చరవాణి నంబర్లను కూడా ఇవ్వండి నచ్చజెప్పి మీ సమస్యను పరిష్క రిస్తానని హామీ ఇచ్చారు.
కనీసం ఇప్పుడైనా ఏదైనా చేయండని మొరపెట్టుకున్నాడు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిస్తూ.. ముందే హామీ ఇచ్చాం... అది చేయలేదు.. మే 10లోపు కచ్చితంగా మీ సమస్య పరిష్క రిస్తాం.. అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. కొందరు ఉద్యోగులు కలుగజేసుకొని వారి సమస్యలు చెప్పుకొచ్చారు. కాస్త అసహనానికి గురైన ఎమ్మెల్సీ... 'అన్నా నేను మే 10 వరకు టైం అడుగుతున్నా. మీరు గౌరవించి నమ్మకముంటే వెయిట్ చేయండి.. మేము ఇలాగే కూర్చొని ఉంటామంటే ఒక్కే మాట. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు. ఓ ప్రజా ప్రతినిధిని.. సమస్య ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించడం నా పని' అని సమ్మెలో ఉన్న ఉద్యోగులకు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ పక్కనే ఉన్న రెక్టార్ ఆచార్య అనురాధ మాట్లాడుతూ.. స్పెషల్ గ్రాంటు తీసుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు.
ఇవీ చదవండి: