తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉద్యోగుల క్యాంటీన్‌లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉచితంగా అందించాలని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో కలెక్టర్ భరత్‌గుప్తా, తితిదే ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా చేయాలన్నారు. ఇందుకోసం ట్రూనాట్ మిషన్లు కొనుగోలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. దర్శనానంతరం ఇళ్లకు వెళ్లిన అనేకమందితో తితిదే సిబ్బంది ఫోన్ ద్వారా సంప్రదించి ఆరోగ్యంపై వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా గదులు కేటాయించాలని ఈవో ఆదేశించారు. సమావేశంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో బసంత్ కుమార్, ఎస్.భార్గవి, తితిదే సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, జేసీ వీరబ్రహ్మయ్య, డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పెంచలయ్య, తితిదే ఆరోగ్యశాఖాధికారి ఆర్.ఆర్ రెడ్డి పాల్గొన్నారు.
తితిదే ఛైర్మన్ సమీక్ష..
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అధికారులను సూచించారు. సోమవారం సాయంత్రం తితిదే ఈవో అధికారులతో సమీక్ష అనంతరం ఛైర్మన్ ఫోన్ ద్వారా సమీక్షించారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ఖర్చుకు వెనుకాడవద్దని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: