భర్త వద్ద ఉన్న చరవాణి విషయంలో రేగిన వివాదం.. దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా... భార్య చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు ఎస్సీ వాడకు చెందిన చంద్రశేఖర్(38) హమాలీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మీదేవి (35), నలుగురు కుమార్తెలున్నారు. చంద్రశేఖర్‌కు ఫోన్ లేదని కుటుంబీకులకు తెలుసు. అయితే అతను రహస్యంగా ఫోన్ వినియోగిస్తున్నాడనే అనుమానంతో భార్య లక్ష్మీదేవి అతన్ని నిలదీసింది. ఫోన్లు ఎవరికి చేస్తున్నావంటూ ప్రశ్నించింది. దీంతో వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి.
చరవాణి విషయంలో బుధవారం రాత్రి మరోసారి దంపతులు గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన భార్య కూడా పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని కుటుంబీకులు మదనపల్లెలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. లక్ష్మీదేవి చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి