కార్మికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న భద్రతా సిబ్బంది
శ్రీసిటీ పారిశ్రామికవాడ పరిధిలో సుమారు 120 పరిశ్రమలు ఉత్పత్తులు సాగిస్తున్నాయి. సమీపంలో 16 గ్రామాల వారు నివాసాలు ఉంటున్నారు. తమిళనాడులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అక్కడి నుంచి వచ్చే కార్మికులతో కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాకు చెందిన వారు విధులు నిర్వహిస్తున్నా.. కేసులు నమోదు కావడం లేదంటే.. శ్రీసిటీ నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలే.
కరోనా వైరస్ కారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో శ్రీసిటీ సమీప గ్రామాల నుంచి కార్మికులు పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి కనబరచకపోవడం, పల్లెల్లో కొందరు ముళ్ల కంచెలు వేసి గ్రామస్థులు ఎవరు బయటకు వెళ్లకూడదంటూ నిబంధనలు విధించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిపై దృష్టి సారించిన శ్రీసిటీ పారిశ్రామికవాడ ఎండీ రవీంద్రసన్నారెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు అనుమానాల నివృత్తికి కృషి చేశారు. అతి కొద్ది మంది కార్మికులు వస్తున్నా వారందరికీ పరిశ్రమల్లోకి వెళ్లకముందే తనిఖీ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయడం, భౌతిక దూరం పాటిస్తూ కార్మికులను బస్సుల్లో తరలించడం, బస్సు ఎక్కే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. పరిశ్రమల్లోకి వెళ్లిన అనంతరం ప్రతి కార్మికుడికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూసి కార్మికులతో పనులు చేయించారు.
ఒక్క పరిశ్రమ మినహా...
శ్రీసిటీ పారిశ్రామికవాడలో 120 పరిశ్రమలు ప్రారంభమై ఉత్పత్తులు సాగిస్తున్న నేపథ్యంలో.. ఓ పరిశ్రమలో సుమారు వంద కేసులకు పైగా నమోదు అయ్యాయి. అక్కడ అన్ని భద్రతా చర్యలు తీసుకున్నా.. కొంతమేర ఇబ్బందులు తప్పలేదు. దాంతో సమీప గ్రామాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక అన్ని పరిశ్రమల కార్మికులకు వైరస్ వ్యాపిస్తుందని అందరూ ఊహించి విధులకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. అతికొద్ది రోజుల్లోనే సమస్యను అధిగమించి మరో పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంక్రమించుకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కార్మికులు యాథావిధిగా పరిశ్రమల్లో విధులకు వెళ్లారు. అదే పరిశ్రమ ప్రతినిధులు సైతం చాకచక్యంగా వ్యవహరించి కార్మికులను గుర్తించడంతో పాటు వారి పరిచయస్తులను త్వరిత గతిన గుర్తించి పరీక్షలు నిర్వహించి రక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పరిశ్రమ కార్యకలాపాలు యథావిధిగా సాగిస్తోంది.
పారిశుద్ధ్య చర్యలు
పరిశ్రమల్లో విధులు నిర్వహించే వారికే కాకుండా సమీప గ్రామాల వారు సైతం ఆరోగ్యంతో ఉండాలన్న ఉద్దేశంతో శ్రీసిటీ చేపట్టిన పారిశుద్ధ్య చర్యలు అందరి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. నిత్యం గ్రామాల్లో ఫాగింగ్ చేస్తూ బ్లీచింగ్ చల్లుతూ గ్రామాల్లో వైరస్ జాడ లేకుండా చేయగలిగారు. దాంతో నెల రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.