చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలే లక్ష్యంగా వైకాపా పావులు కదిపింది. ప్రలోభాలు, బెదిరింపులు, పోలీసు కేసులు తదితర కారణాలతో ఏకగ్రీవాలు చేయాలనే ధోరణిలోనే తొలి నుంచీ వ్యవహరించింది. నామినేషన్ల రోజు జరిగిన దౌర్జన్యకాండ ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. ఎనిమిది సుమోటో కేసులు నమోదు కావడం చూస్తే పరిస్థితి ఎంతలో దిగజారిందో అర్థం చేసుకోవచ్ఛు పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసే నాటికే రెండు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. పరిశీలన తర్వాత ఈ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. జిల్లావ్యాప్తంగా 65 జడ్పీటీసీ స్థానాలకుగాను రెండు చోట్ల తెదేపా పోటీకి ముందుకురాలేదు. ఇందులో ఒకటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుం కాగా.. మరొకటి పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి. అన్నిచోట్ల నామపత్రాలు వేసిన.. తెదేపా నాయకులు ఇక్కడ నామినేషన్లు వేయకపోవడం చర్చకు దారి తీసింది. సామదానభేదదండోపాయాలను ప్రయోగించి అధికార పార్టీ ఈ రెండుచోట్ల తమ ఆధిపత్యాన్ని చూపించాయి.
పరిశీలన తర్వాత మరిన్ని ఏకగ్రీవం
నామపత్రాల పరిశీలన తర్వాత ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల నామినేషన్లన్నీ తిరస్కరణకు గురి కావడంతో మరికొన్ని జడ్పీటీసీ స్థానాలు వైకాపా ఖాతాలో పడ్డట్లయింది. ఇందులో బి.కొత్తకోట, బి.ఎన్.కండ్రిగ, సోమల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి రూరల్, వాల్మీకిపురం ఉన్నాయి. ఓటరు జాబితాలోని అభ్యర్థి సీరియల్ నెంబర్ తప్పని, సంతకాలు సరిగాలేవని వంటి సాకులతో తిరస్కరించినట్లు తెలుస్తోంది. అధికారపార్టీ ఒత్తిళ్ల కారణంగా కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అప్పీళ్లకు వెళ్లేందుకు జంకారు. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, చౌడేపల్లె, సోమల, పుంగనూరు, పులిచెర్ల ఎంపీపీస్థానాలు వైకాపా ఖాతాలో చేరినట్లే. జిల్లావ్యాప్తంగా సుమారు 170కిపైగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవాలు కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా తంబళ్లపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోనే ఉన్నాయి.
ఉపసంహరణకు ఒత్తిడి
నామినేషన్ల ఉపసంహరణకు శనివారమే గడువు. నామపత్రాలు దాఖలైన రోజు నుంచి పోటీ నుంచి వైదొలగాలంటూ అధికార పార్టీ అభ్యర్థుల నుంచి ప్రత్యర్థి పార్టీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులు రంగంలోకి దిగారు. గ్రామాలకు వెళ్లి పోటీలో ఉన్న వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా అవకాశం కల్పిస్తామని, గతంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పిస్తామని, లేదంటే కొత్తగా కాంట్రాక్టులు ఇప్పిస్తామని, నగదు ఎర వేస్తున్నారు. ప్రలోభాలకు లొంగకపోతే పాత కేసులు తిరగదోడి జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు వస్తున్నాయి. కొన్ని మండలాల్లో పోలీసు అధికారులు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడి ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థులను అజ్ఞాతంలోకి పంపించాయి.
ప్రతిపక్షం.. బహిష్కరణాస్త్రం
ఇక, పుంగనూను, శ్రీకాళహస్తి నియోజకవర్గాలతో పాటు కురబలకోట మండలంలో ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రకటించడం చర్చనీయాంశమైంది.
- శ్రీకాళహస్తి మండలంలో జడ్పీటీసీగా నామినేషన్ వేసిన ఆదెమ్మ పత్రాల పరిశీలన సమయంలో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె కుమారుడిని అరెస్టు చేసి రేణిగంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలా కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
- శ్రీకాళహస్తి మండల పరిధిలో 15 ఎంపీటీసీ స్థానాలకు తెదేపా నుంచి 43 నామినేషన్లు వేశారు. చివరకు ఆరు మాత్రమే సరిగ్గా ఉన్నట్లు అధికారులు తేల్చారు. మిగిలినవన్నీ చిన్నచిన్న సాకులతో తిరస్కరించారు. వీటిపై అప్పీలుకు వెళ్లకుండా బెదిరించారు.
- ఏర్పేడు మండలంలో 16 సెగ్మెంట్లకు తెదేపా తరఫున 34 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ తెదేపా అభ్యర్థుల నామినేషన్లన్నింటినీ గంపగుత్తగా తిరస్కరించారు. కనీసం ఒక్కటీ ఆమోదం పొందలేదంటే అధికారులు అధికార పక్షానికి ఎలా అనుకూలంగా వ్యవహరించారో స్పష్టమవుతోందని తెదేపా నేతలు విమర్శిస్తున్నారు.
- తొట్టంబేడు మండలంలో 12 సెగ్మెంట్లకు 29 నామినేషన్లు వేయగా.. పరిశీలన తర్వాత ఇక్కడ ఆరు చోట్ల మాత్రమే తెదేపా పోటీలో నిలిచింది.
- రేణిగుంట-3 ఎంపీటీసీ స్థానానికి ఎస్సై బలరాం భార్య అరుణ అధికార పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగి భార్యను.. అదే స్థానంలో పోటీకి ఎలా అనుమతించారన్నది తెదేపా ప్రశ్న.
- రెండ్రోజుల క్రితం మద్యం అక్రమంగా నిల్వ చేశారంటూ తెదేపా మండల కమిటీ అధ్యక్షుడు కామేష్‌యాదవ్‌ను అరెస్టు చేశారు.
పుంగనూరు నియోజకవర్గంలో...
- సదుం మండలంలో తెదేపా నేతలు ఎవరూ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. వచ్చిన వారిపై రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఇక్కడ 10 సెగ్మెంట్లు ఉండగా అన్నింటా ఏకగ్రీవమే అయ్యాయి.
- సోమల మండలంలో 12 సెగ్మెంట్లకు తెదేపా 11 నామినేషన్లు వేయగా.. పరిశీలనలో రెండు నిలిచాయి. మిగిలినవన్నీ తిరస్కరించారు.
- పుంగనూరు మండలంలో 16 సెగ్మెంట్లకు 17నామినేషన్లు రాగా.. తెదేపాకు చెందిన ఒక్కనామినేషన్‌నూ ఆమోదించలేదు.
- పులిచర్లలో 11 సెగ్మెంట్లకు 10 నామినేషన్లు పడ్డాయి. నాలుగు మాత్రమే ఆమోదం పొందాయి.
ఇదీ చదవండి : మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!