తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 3 రోజులపాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా... 14 నియోజకవర్గాల శ్రేణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా నేతలతో విడివిడిగా భేటీ కానున్న చంద్రబాబు... దాడులకు గురైన కార్యకర్తలు, వారి కుటుంబాలతో ఒక రోజు సమావేశం కానున్నారు.
ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న తెదేపా అధినేత... రోడ్డు మార్గం ద్వారా చంద్రగిరి మండలం ఐతేపల్లె సమీపంలోని శ్రీదేవి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. తొలిరోజు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా, మండల కమిటీలు, అనుబంధ విభాగాలు, ముఖ్య నేతలతో సమావేశమై... పార్టీ ప్రగతి, స్థితిగతులపై చర్చిస్తారు.
రెండోరోజు పర్యటనలో భాగంగా... వైకాపా శ్రేణుల కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. పోలీసు కేసులు, ప్రత్యర్ధి పార్టీ దాడులు ఎదుర్కొనేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత, 6 నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతారు. మూడోరోజు ఉదయం జిల్లా సమన్వయ కమిటీతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పలు నియోజకవర్గాల నేతలతోనూ భేటీ అవుతారు. అదేరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి, అనంతరం విజయవాడ చేరుకుంటారు.
ఇదీ చదవండీ... బిల్డ్ ఏపీ అమలుకు ఎన్బీసీసీతో ఎంవోయూ