చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధి చిన్నూరు-సోమపురం సమీపంలోని చెలమవంక గుట్ట క్వారీలో బుధవారం జరిగిన పేలుళ్లలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. క్వారీలో రాతిగుట్టలను పెకిలించేందుకు కార్మికులు పేలుళ్లు జరపగా బండలు పగిలి మీద పడటంతో గోవిందు (46) అనే కార్మికుడు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలో మృతి చెందాడు.
ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వగ్రామం గుడుపల్లె మండలంలోని కేజీకొటాలు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బెంగుళూరులో కూలి పని చేసుకునే గోవిందు.. కొవిడ్ లాక్‌డౌన్‌లో స్వగ్రామానికి వచ్చి ఇక్కడే క్వారీలో పని చేస్తున్నాడు. గ్రామీణ సీఐ యతీంద్ర, ఎస్సై లక్ష్మీరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్వారీకి అనుమతి లేదని విచారణలో తేలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే క్వారీకి చెందిన వ్యక్తులు యంత్రాలు, సామగ్రితో పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు.
వైకాపా నేతల ధనదాహానికి కార్మికుల బలి: చంద్రబాబు
చిన్నూరు క్వారీలో నిబంధనలు పాటించకుండా అక్రమ మైనింగ్ నిర్వహించడం వల్లే పేలుళ్లు సంభవించాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్న వారికి వైకాపా నేతలు ధనదాహంతో అండగా నిలుస్తున్నారని, దీనివల్ల కార్మికులు బలవుతున్నారని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. పేలుళ్లలో మరణించిన గోవిందుకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయంతోపాటు పరిహారం అందించాలని డిమాండు చేశారు.
ఇదీ చదవండి: