నిరసన చేస్తున్న భాజపా నేతలను అడ్డుకుంటున్న పోలీసులు ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగాయ... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా నేతలు ర్యాలీ చేపట్టారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో విత్తన అభివృద్ధి సంస్థ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్ ఎదుట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సర్వత్రా గందరగోళం నెలకొంది. వైకాపా అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే అవినీతి, అక్రమాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ వైకాపా ఆఫీసులుగా... అధికారులంతా కార్యకర్తలుగా ప్రవర్తించడం దారుణమన్నారు. శ్రీకాళహస్తిలో ఇసుక, ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అడుగడుగునా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుచరులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించడం తగదని అన్నారు.