తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం ఆలయం నుంచి తీసుకు వచ్చిన పట్టు వస్త్రాలను తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకెళ్లారు. మందిరంలోని బంగారు వాకిలి వద్ద ఘంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా ఆసీనులు చేసి పాలు, తేనె, పచ్చకర్పూరం, సుగంధమైన పరిమళాలతో అభిషేకాలు నిర్వహించారు.
స్వామివారికి ఆదాయ, వ్యయాల నివేదన
గర్బాలయంలోని శ్రీవారి మూలమూర్తి ముందు గత ఏడాది పొడవునా ఎంత ఆదాయం వచ్చింది... అందులో భక్తుల అవసరాలు, దేవస్థానం అభివృద్ది కోసం ఎంత ఖర్చులు చేసింది తితిదే అధికారులు లెక్కలు చెప్పారు. ఆదాయ వ్యయాలు నివేదన పూర్తైన తరువాత అర్చకులు పెద్దజీయర్, చిన్నజీయంగార్లకు, ఈవో జవహర్ రెడ్డి కుడిచేతికి.... లచ్చన అను తాళపు చెవిని వరుసక్రమంలో తగిలించి హారతి, చందన, తాంబూల తీర్థ శఠారి మర్యాదలు చేశారు.
తిరుమలలో ఈరోజు నుంచి నూతన ఆదాయ లెక్కలు
అనంతరం తాళపు చెవిని మూలవిరాట్టు పాదాల చెంత ఉంచారు. ఈ సమయంలో దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి ఒక్కోరూపాయి వసూలు చేసి కర్పూర హారతి ఇచ్చారు. అలా వచ్చిన రూపాయిలను ఈవో సమక్షంలో తితిదే ఖజానాకు జమచేయడంతో నూతన లెక్కలు ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం జరిగే పుష్పపల్లకి సేవతో ఆణివార ఆస్థానం ముగుస్తోంది.
ఇదీ చూడండి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శన వేళల్లో మార్పు.. రాత్రి 9 గంటల వరకు అనుమతి