Amaravati Farmers padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 37వ రోజూ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. వల్లివేడు మీదుగా పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద రైతులకు స్థానికులు, తెదేపా నేతలు అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నాని, బొజ్జల సుధీర్లు ఘనస్వాగతం పలికారు.
ఈరోజు పాదయాత్ర చింతలపాలెం వరకు యాత్ర కొనసాగనుంది. రాత్రికి చింతలపాలెంలోనే రైతులు బస చేస్తారు. ఇవాళ దాదాపు 16 కిలోమీటర్లు నడవనున్నట్లు అన్నదాతలు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అమరావతి రైతుల పాదయాత్రకు స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే కొరుగండ్ల రామకృష్ణ.. రైతుల పాదయాత్రకు రూ.10లక్షలు విరాళం ప్రకటించారు.
సొమ్మసిల్లి పడిపోయిన నేత...
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి... సొమ్మసిల్లి పడిపోయారు. జగ్గరాజుపల్లి నుంచి వాంపల్లె వరకు రైతులతో కలిసి నడిచిన ఆయన ఉన్నట్లుండి కిందపడిపోయారు. వైద్య చికిత్స కోసం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు.
శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలి..!
ఈనెల 17న అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించబోయే సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస నేతలు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాము సమాధానాలు పంపినట్లు వివరించారు. సభకు అనుమతిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్న వారు.. అనుమతి త్వరగా ప్రకటిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు. తిరస్కరిస్తే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
పాదయాత్రగా వస్తున్న రైతులందరికీ తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని.. అమరావతి పరిరక్షణ సమితి నేతలు తితిదేను కోరారు. ఈనెల 15, 16వ తేదీల్లో స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పించాలని అభ్యర్థించారు. అలాగే ఈ విషయానికి రాజకీయాలు ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో మొత్తం 200 కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపిన నేతలు.. ఒక్కసారి కాకపోయినా విడతల వారీగా అయినా మొక్కు చెల్లించుకునే భాగ్యం కల్పించాలని కోరారు.
ఇదీచదవండి.