Applications For Solar Panels in Joint Krishna District : ప్రతి ఇంట్లో సోలార్ వెలుగులు నింపాలన్న ప్రభుత్వ ఆశయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇంటి మిద్దెలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సౌర విద్యుత్తుతో వినియోగదారుల అవసరాలు తీరడంతోపాటు మిగులు విద్యుత్ సాధ్యమవుతోంది. మరోవైపు పర్యావరణహితంగానూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అందరికీ చేరువవుతోంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లావాసులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు.
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు, సాంప్రదాయ ఇందన వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. సౌర విద్యుత్తు రంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజలకు రాయితీని అందిస్తూ పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకొచ్చాయి. ఈ పథకాన్ని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వంద శాతం అమలు చేయనున్నారు. విద్యుత్తు వినియోగదారులకు బిల్లుల భారం తగ్గడంతో పాటు ఆదాయం సైతం పొందవచ్చని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా సోలార్ ప్యానల్స్.. ఇక కరెంట్ బిల్ నుంచి విముక్తి!
దీనికోసం దరఖాస్తులు చేసిన రోజుల వ్యవధిలోనే ఇళ్లపై సోలార్ ప్లాంట్లు అమర్చుతున్నారు. ప్రజలు కూడా వీటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. పీఎం సూర్యఘర్ ముప్త్ బిజిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో ప్రవేశపెట్టింది. కృష్ణా జిల్లాకు 9వేలు, ఎన్టీఆర్ జిల్లాకు 20వేల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 6,600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 1240 మందికి అధికారులు అనుమతులు ఇచ్చారు. 1107 మంది ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు.
పథకం అమలులో భాగంగా కిలో వాట్‌కు 30వేలు, రెండు కిలో వాట్లకు 60వేలు, మూడు కిలో వాట్లకు 78 వేలు రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. నెల రోజుల వ్యవధిలోనే రాయితీ నగదు ఖాతాల్లో జమవుతుంది. ఈ పథకం ద్వారా ప్రజలకు బహుళ ప్రయోజనాలు ఉండటంతో 2లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. సౌర విద్యుత్తు కోసం దరఖాస్తుచేసుకునే ముందే వినియోగదారుడు 60వేల విలువచేసే సౌర విద్యుత్తు పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2లక్షల విలువైన మూడు సోలార్ ప్యానళ్లు అమర్చుకుంటే ప్రభుత్వం నుంచి 78వేలు రాయితీ ఉంటుంది. 20వేలు లబ్ధిదారు వాటా పోను మిగిలిన లక్షా 2వేలు అతి తక్కువ వడ్డీకి బ్యాంకులు నుంచి రుణం పొందవచ్చు.
ఆ ఆలోచన.. ఆదా చేసే.. ఆదాయం మిగిల్చే...
సౌర విద్యుత్తు వినియోగదారుడు ఇంట్లో లేనప్పుడు, వినియోగించగా మిగిలిన విద్యుత్తును విక్రయించుకునే వీలుంటుంది. ఇందుకు ప్రతి యూనిట్‌కు 2.90 రూపాయలు చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్తు శాఖ వినియోగదారులకు నగదు చెల్లిస్తారు. సుమారు నాలుగైదేళ్లలోపు పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. మూడు కిలో వాట్ల ప్యానళ్ల ఏర్పాటు వరకు మాత్రమే ప్రభుత్వ రాయితీ వర్తిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంద శాతం పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఎన్టీఆర్ జిల్లాలో 5వేలు జనాభా కలిగిన 5 పంచాయితీలు బూదవాడ, షేర్‌మహ్మద్‌పేట, పరిటాల, వెల్వడం, కంభంపాడును ఆదర్శ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశారు.
కృష్ణా జిల్లాలో ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయాల్సి ఉంది. ఐదు కిలో వాట్లకు పైగా విద్యుత్తును వినియోగించే ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 3,197 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 3,400 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సూర్యఘర్ పథకంతో బహుళ ప్రయోజనాలు ఉండటంతో లబ్దిదారులు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. వినియోగం పెరిగే కొద్ది ప్రజల్లో అవగాహన పెరిగి ప్రతి ఇంటా సౌర వెలుగులు విరజిమ్మే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటే అతిశయోక్తి లేదు.
శీతల గోదాములపై సౌరవిద్యుత్ ప్లాంట్లు...రాయితీ ఇస్తున్న ఉద్యానశాఖ!