చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో ఈతగుంట వద్ద 18 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్నకొందరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. అయితే వారిలో ఒక స్మగ్లరును పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు నుంచి కూంబింగ్ చేపట్టారు.
అయితే శనివారం తెల్లవారుజామున ఈతగుంట వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ.. పోలీసులకు తారసపడ్డారు. వీరిని హెచ్చరించి చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. వారు దుంగలు పడేసి పారిపోయారు. వారిని వెంబడించగా తమిళనాడుకు చెందిన రాజ్‌కుమార్ (60) ను పట్టుకున్నారు. ఇతన్ని విచారించగా వారం రోజుల క్రితం 21 మంది అడవిలోకి వెళ్లినట్లు చెప్పారని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. 18 దుంగలు ఏ గ్రేడ్‌కు చెందినవని, వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు.
కడప జిల్లా రైల్వే కోడూరులోనూ..
రైల్వేకోడూరు మండలంలో 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. తురకపల్లె బ్రిడ్జి వద్ద 10 ఎర్రచందనం దుంగలను కారులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే స్మగ్లర్లు కారును వదిలేసి పరారయ్యారు.
ఇదీ చదవండి: