వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు దిల్లీలో పర్యటించనున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించనున్నారు. ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 9.10 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. అనంతరం నేరుగా లోక్కల్యాణ్మార్గ్లోని ప్రధాని నివాసానికి వెళ్లనున్నారు. ఉదయం 10.40 నిమిషాలకు మోదీ నివాసానికి చేరుకుని భేటీ కానున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 23నిమిషాలకు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ సహా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని శనివారం ఆహ్వానించిన జగన్.. ప్రధానిని రావాలని కోరనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్ర పరిస్థితులపై చర్చ
నేడు జరిగే భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక సాధిస్తామని ఎన్నికల్లో జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకహోదా ఇవ్వాలని మోదీని కోరనున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కానందున రాష్ట్రం ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రధానికి వివరించి... సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున కేంద్రం తగిన సాయం అందించడం ద్వారా ఆదుకోవాలని కోరనున్నారు. ప్రధానితో సమావేశానికి ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో చర్చించిన జగన్.. ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులను నివేదిక రూపంలో తెప్పించుకున్నారు. అధికారిక నివేదిక ప్రకారం వాస్తవ పరిస్థితిని ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో వైఎస్ జగన్ భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఫలితాలు సహా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపాయి.
తొలిసారి ఏపీ భవన్కు
జగన్ తొలిసారి ఏపీ భవన్కు వెళ్లనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలుసార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ జగన్ ఒక్కసారి కూడా ఏపీ భవన్లో అడుగుపెట్టలేదు. మోదీతో భేటీ ముగిసిన అనంతరం ఏపీ భవన్కు చేరుకుని సిబ్బందితో పరిచయ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మధ్యాహ్న భోజనం ఇక్కడే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని ఏపీ భవన్ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ నుంచి ఆయన తిరుపతికి వెళ్లి బస చేయనున్నట్లు సమాచారం. జగన్ రాక సందర్భంగా ఇక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.