2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈసారి మహిళ, శిశు సంక్షేమ శాఖ కు 3 వేల 408 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్ తో పోల్చితే 13 శాతం నిధులు పెంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల ప్రసగింస్తూ ...మహిళా సాధికారతే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.
పసుపు- కుంకుమ తొలి దశ కింది రూ.8,604కోట్లు ఇచ్చామని వెల్లడించారు. ప్రతి మహిళకు 10 వేల రూపాయలు అందజేశామని చెప్పారు. దాదాపు 93.81 లక్షల మందికి రూ.9,381 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. స్త్రీనిధి లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేశామన్న మంత్రి....రుణాల మొత్తాన్ని 5 రెట్లు పెంచామన్నారు. మహిళలకు రూ.2,514కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి 180 రోజుల ప్రసూతి సెలవులు ఇచ్చామన్నారు. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ తో 7.19లక్షల మహిళలకు లాభం చేకూరిందని, 6.91లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబి కిట్స్ అందాయని యనమల తెలిపారు.