రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం... పోలీసు శాఖలోనూ బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన డీజీపీ గౌతంసవాంగ్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోని పలువురు ఐజీలు సహా జోన్ల వారీగా ఉన్న ఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఎవరెవర్ని బదిలీ చేయాలి,... ఎవరికి ప్రాధాన్యత పోస్టులివ్వాలి అనే అంశంపై సీఎం డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరోపణలు వచ్చిన పలువురు పోలీసు అధికారులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. సమర్ధత కలిగిన పోలీసు అధికారులకు నియామకాల్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు తుది జాబితా సిద్ధం చేసిన తర్వాత.. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది.
జగన్ను కలిసిన అజేయ కల్లం
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీఎం జగన్ను ఆయన నివాసంలో కలిశారు. తనను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించినందుకు జగన్కు ధన్యవాదాలు తెలిపారు.