రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాతో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం ఒకేసారి 175 మంది అభ్యర్థులను ప్రకటించగా తెలుగుదేశం ఇంకా 35 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆశావహులు... రాజకీయ సమీకరణాలతో చర్చల దశలోనే ఉన్నాయి ఈ నియోజకవర్గాలు. అర్ధరాత్రివరకు తుది జాబితాపై స్పష్టత వస్తుందని నేతలు ఆశాభావంతో ఉన్నారు.
జిల్లాల వారీగా..
రాజకీయ సమీకరణాలు, అశావాహుల బుజ్జగింపులు, ప్రత్యర్థుల బలాలను అంచనా వేస్తున్న తెలుగుదేశం పార్టీ.... ఇంకా 35 స్థానాలపై ఎటూ తేల్చకపోవడం నేతల్లో టెన్షన్ పెంచుతోంది. ఈ పెండింగ్ స్థానాలపై అధినాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లోనిఅన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.... విజయనగరంలో 1, విశాఖలో 5, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, పశ్చిమగోదావరి జిల్లాలో 3 స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. గుంటూరు జిల్లాలో 3, నెల్లూరులో 4 సీట్లు ఖరారు కావాల్సి ఉంది. రాయలసీమ విషయానికొస్తే కడప, కర్నూలు జిల్లాలో మూడేసి స్థానాలపై నిర్ణయం తీసుకోగా,,, చిత్తూరులో 4, అనంతపురంలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఉత్తరాంధ్రలో ఒకట్రెండే పెండింగ్..
విజయనగరం జిల్లాలో నెలిమర్ల అభ్యర్థి ఎవరా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ జిల్లాలో భీమిలిపై స్పష్టత రాలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, మాడుగులలో రామానాయుడు, చోడవరంలో కేఎస్ఎన్ రాజు, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.
ఉభయగోదావరి జిల్లాలో...
రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క అమలాపురం పెండింగ్‌లో ఉంది. బాలయోగి తనయుడు హరీష్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. నిన్నే పార్టీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్కు అమలాపురం ఎంపీ టిక్కెట్ దక్కేలా ఉంది.
పశ్చిమగోదావరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 3 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావుకు లేకుంటే సోదరుడు వేణుగోపాల్ కృష్ణకు ఆ సీటు ఖరారు కావచ్చు. నర్సాపురం అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కోస్తా జిల్లాలో..
గుంటూరు జిల్లా మాచర్ల నుంచి అంజిరెడ్డి, చెలమారెడ్డి పోటీ పడుతున్నారు. బాపట్ల నుంచి అన్నం సతీష్ రేస్‌లో ఉండగా, మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి కుమారుడు సీటు ఆశిస్తున్నారు. నరసరావుపేటకు అరవింద్ బాబు, రావెల సత్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శి స్థానానికి కదిరి బాబురావు, ఉగ్ర నరసింహారెడ్డి పేరు వినిపించినా... మంత్రి శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డి, బాబూరావులో ఒకరికి టిక్కెటు ఇవ్వాలనే ఆలోచనలో తెదేపా అధినేత ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో కావలి టిక్కెటు తొలుత బీదా మస్తాన్‌రావుకు అనుకున్నప్పటికీ...ఆయన్ని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మస్తాన్‌రావు సోదరుడు బీదా రవిచంద్రయాదవ్ కోరుతున్నారు. ఉదయగిరి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఎర్ర చిన బ్రహ్మయ్య పోటీ పడుతున్నారు. నెల్లూరు రూరల్ కోసం పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు.
రాయలసీమలో..
కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు లేదా అమీర్ బాబు పేర్లు అధినేత చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి. రైల్వే కోడూరు నుంచి నర్సింహప్రసాద్, ప్రొద్దుటూరు నుంచి వీర శివారెడ్డి లేదా లింగారెడ్డితోపాటు వరదరాజుల రెడ్డిలలో ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని నంద్యాల స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి లేదా శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. కర్నూలు అర్బన్ స్థానంలో తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ గట్టిగా పోటీపడుతున్నారు.
అనంతపురం జిల్లాలో కదిరి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చాంద్ బాషా ఉన్నారు. అయితే ఆ స్థానం తనకు కావాలంటూ కందికుంట ప్రసాద్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని గెలవాలంటే ఆ పరిధిలోని 3 స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అధినాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం స్థానాలకు సిట్టింగ్‌లను కాకుండా వేరే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 4 స్థానాల్లో పూతలపట్టుకు లలితా థామస్ పేరు పరిశీలిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్యకు పోటీగా హేమలత, రాజశేఖర్ పోటీపడుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశారు. తంబళ్లపల్లి నుంచి శంకర్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా లక్ష్మీ దేవమ్మ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.