తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రజావేదిక సహా తాజా పరిణామాలు చర్చకు వచ్చాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, విధానాలు, కార్పొరేషన్లు, సంస్థలపై లోతైన సమీక్ష కోసం ఐదుగురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని మాజీ మంత్రులు కళా వెంకట్రావ్, నారాయణలు తీవ్రంగా తప్పుబట్టారు. 'తానెటూ అవినీతి అభియోగాలను 13 ఛార్జిషీట్లలో ఎదుర్కొంటున్నాడు కాబట్టి మిగిలిన వారిపై కూడా అవినీతి బురద జల్లడం ద్వారా తాను ఒడ్డున పడాలన్న ధోరణితో సీఎం జగన్ వ్యవహరిస్తున్నాడు' అని నేతలు ఆరోపించారు. గతంలో జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 26 విచారణ కమిటీలు,14 సభా సంఘాలు , 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 జ్యుడిషియల్ కమిటీలు, సీబీసీఐడీ విచారణలు తమ అధినేత చంద్రబాబుపై జరిపించినా ఏ ఆరోపణ రుజువు కాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందని జగన్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని కళావెంకట్రావు వివరించారు.
రాజధాని నిర్మాణంలో అవినీతి లేదు
రాజధాని నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిందని మరో మాజీ మంత్రి నారాయణ స్పష్టంచేశారు. ప్లాట్ల కేటాయింపులో ఏ విధమైన అవకతవకలు లేకుండా కంప్యూటరైజ్డ్ లాటరీ విధానంతో రైతుల సమక్షంలో కేటాయింపులు జరిపామన్నారు. సంస్థలకు చేసిన భూముల కేటాయింపు కూడా పారదర్శక పద్ధతిలో రాజధాని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ ఉపసంఘం ద్వారా చేశామని నారాయణ వివరించారు. రాజధానిలో చేపట్టిన పనులకు టెండర్లను పిలవడంలో కూడా ఇ-టెండర్ విధానాన్ని అనుసరించి పారదర్శక పద్ధతిలో పనులు చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడితే ఇప్పుడు జగన్ రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. అభద్రతా భావం కల్పించడం, పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని నారాయణ మండిపడ్డారు.