రాష్ట్రం కోసం తెదేపా ధర్మ పోరాటం చేసిందని ప్రవాసాంధ్రులతో వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు. ధర్మాన్ని కాపాడామనీ... ఇప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతోందని చెప్పారు. కొంతమంది రాష్ట్రానికి చెడు చేయాలని చూసినా... ప్రకృతి తమతోనే కలిసివచ్చిందని స్పష్టం చేశారు. మంచివారికి మంచే జరుగుతుందన్న చంద్రబాబు... ఎవరైనా చెడు చేయాలని ప్రయత్నించినా చివరికి మంచే అవుతుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రక్రియలో ప్రవాసాంధ్రుల పాత్ర మరువలేనిదని.. కీలక భూమిక పోషించారని ప్రశంసించారు.
''జన్మభూమి - మా వూరు, గ్రామ దర్శని - గ్రామ వికాసం, స్మార్ట్ విలేజి - స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించారు. ఇంతకు రెట్టించిన స్ఫూర్తితో మరింతగా రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి రుణం తీర్చుకోవాలి. స్వగ్రామం, స్వరాష్ట్రం, స్వదేశం అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి, కర్మభూమి రుణం తీర్చుకోలేనిది. ఎక్కడ పనిచేస్తున్నారో, ఆ దేశం (కర్మ భూమి) అభివృద్దికి దోహదపడాలి. ఆ దేశ జీడీపీ వృద్దికి మీ ప్రతిభ, కష్టం తోడ్పడాలి. ఎక్కడ అవకాశాలుంటే అక్కడ ఆంధ్రులను ప్రోత్సహించండి. తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపచేయండి. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రతి పౌరుడు ఎదగాలి, ప్రతి ప్రవాసాంధ్రుడు రాణించాలి. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా జలవనరులు అభివృద్ది చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో వృద్దిరేటును 15 శాతానికి పెంచేలా శ్రమిస్తాం. పెట్టుబడి రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఆరోగ్యకర పంట ఉత్పత్తులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేలా చూస్తాం. పంచనదులను అనుసంధానం చేస్తున్నాం. నీటిపారుదల ప్రాజెక్టులు 23 పూర్తి చేశాం. 67 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఖర్చు చేశాం. నీరు - ప్రగతి, జల సంరక్షణ ఉద్యమం చేపట్టాం. వీటన్నింటి వల్లే, 5 ఏళ్లు వర్షాభావంలో కూడా సాగునీటి కొరత లేకుండా చేయగలిగాం. వ్యవసాయంలో వృద్ది తగ్గకుండా చూశాం. 9 ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటిని ప్రోత్సహించాను. 300 ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పాం. నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేశాం. అందువల్లే రైతుబిడ్డలు ఇంజనీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నాం. 13జిల్లాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నాం. డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేశాం. 5 వేల కోట్ల రూపాయలతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచాం. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాం. విదేశాలనుంచి పెట్టుబడులు రాబట్టాం, పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. 150 దేశాల్లో 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి అభివృద్దికి చేయూత అందించాలి, సంఘీభావంగా నిలబడాలి. అప్పుడు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారు, ప్రజలంతా ఆమోదించారు. ఇప్పుడు 'మళ్లీ నువ్వే రావాలి' అన్నారు. మీరు చేసిన కష్టం,మీరు చూపిన చొరవ చాలా ఉపయోగపడింది. ''
- ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
జేఈఈ మెయిన్స్ లో తొలి 4 ర్యాంకులు రాష్ట్రానికే వచ్చాయని... తెలుగు విద్యార్ధుల ప్రతిభకు ఇదే నిదర్శనమనీ సీఎం చెప్పారు. నాలెడ్జ్ ఎకానమిలో ఆంధ్రప్రదేశ్‌దే పైచేయి కావాలని ఆకాంక్షించారు. ఆవిష్కరణల్లో ఆంధ్రులదే పైచేయి కావాలని అభిలషించారు. రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా రూపొందాలన్నారు. ఇకపై.. పోటీ పరీక్షల్లో తొలి 100 ర్యాంకుల్లో తొలి 25 స్థానాల్లో మనవాళ్లే ఉండాలని... నాలెడ్జ్ సొసైటిలో 25% వాటా మనదే కావాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. పారిశ్రామిక వేత్తలుగా ప్రవాసులంతా ఎదగాలని.. ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి చేరాలని దిశా నిర్దేశం చేశారు. రాబోయే పది,పదిహేనేళ్లలో ప్రపంచంలోనే తెలుగుజాతి సాటిలేని మేటిగా రూపొందాలని అన్నారు.