రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇవాళ ఒకే రోజు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయం భానుడు ఉగ్రరూపం చూపించి నిప్పులు కురిపిస్తే...మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో ఆకస్మికంగా ఏర్పడిన క్యుములో నింబస్ మేఘాలు వర్షం కరుపించాయి. ఈదురుగాలు, ఉరుములు పిడుగులతో రెండు గంటలపాటు బీభత్సం సృష్టించాయి.
ఉదయం భానుడి వంతు.. మధ్యాహ్నం తర్వాత వరుణుడు
రాష్ట్రంలో ఉదయం ఎనిమిది నుంచి భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా భారీ గాలులతో కూడిన వర్షం మొదలైంది. ఉష్ణగాలుల తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 46.44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడులోనూ 46.26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ప్రకాశం జిల్లా మార్టూలులో 45.94, కర్నూలు జిల్లా డోర్నిపాడులో 45.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
నేలకొరిగిన వృక్షాలు...
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మధ్యాహ్నం తర్వాత క్యుములో నింబస్ మేఘాలు సృష్టించిన పెనుబీభత్సం ప్రజల్లో భయాందోళనలు రెేకెత్తించింది. గంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలుల దాటికి అమరావతిలోని సచివాలయంలోని 4, 5 బ్లాకుల్లోని పైకప్పులు ఎగిరిపడ్డాయి. వాతావరణ వివరాల నమోదు కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ పోల్స్ కుప్పకూలాయి. విజయవాడ నగరంతో పాటు మంగళగిరి, తాడేపల్లి వద్ద భారీ హోర్డింగులు, వృక్షాలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. బీభత్సాన్ని స ృష్టించాయి.