ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు ఉద్ఘాటించారు. ఏపీలో 10 జాతీయ సంస్థలను నిర్మించాలని విభజన చట్టంలో చెప్పారన్న జీవీఎల్... చట్టంలో ఉన్నవాటిని పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. ఐఐటీ, ఐఐఎం సంస్థలు ఇప్పటికే నడుస్తున్నాయన్న భాజపా నేత... ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీ సంస్థలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
ఇంత తక్కువ సమయంలో గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంస్థలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఏపీలోని విద్యాసంస్థలకు రూ.6,190 కోట్లు కేటాయించామన్న జీవీఎల్... గతంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ ఒక రాష్ట్రానికి ఇన్ని నిధులు కేటాయించలేదని స్పష్టం చేశారు. వాస్తవాలు మాట్లాడితే విపక్షాలు భయపడుతున్నాయని జీవీఎల్ ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పేవారికి ప్రజలు బుద్ధి చెప్పారన్న నరసింహారావు... తాము చెబుతున్నవన్నీ అధికారిక లెక్కలని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 32 ఏళ్లపాటు ఆంధ్రప్రాంత నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నారన్న జీవీఎల్... అన్నిప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే యోచన ఆ నేతలకు కలగలేదని దుయ్యబట్టారు. అనేక జాతీయ సంస్థలు హైదరాబాద్‌లోనే ఏర్పడ్డాయని... దీనికి అప్పటి పాలకులే కారణని విమర్శించారు. నవ్యాంధ్రకు ఇదే పెద్ద శాపంలా మారిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...