నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయించే దిశగా సీఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. వ్యవసాయం తప్ప మరే వ్యాపకం తెలియని కర్షకులను... వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇప్పించింది. రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి నమూనాలుగా నిలిచిన ప్రాజెక్టులను ప్రత్యక్షంగా చూపించి... వాటిపై సమగ్ర అవగాహన కల్పించింది. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి... స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో... ఐదేళ్ల క్రితం ఉత్పత్తుల విలువ 4 వందల కోట్లు. ఇప్పుడు ఆ విలువ ఊహించనంత పెరిగింది. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల త్యాగం వల్లే సాధ్యమైందన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. అందుకే రాజధానిలో జరిగే కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం రైతులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అన్నదాతలే ముందు అనే నినాదాన్ని సీఆర్డీఏ అధికారులు అమలు చేస్తున్నారు.
హ్యాపీనెస్ట్ పేరిట ప్రజానివాస సముదాయాలను నిర్మించాలని భావించిన సీఆర్డీఏ... అందుకు అనుగుణంగా ఆన్‌లైన్ బుకింగ్‌లు నిర్వహించింది. రాష్ట్రం నుంచే కాకుండా దేశ.. విదేశాల్లోని తెలుగు వారి నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. భూమి విలువ పెరిగింది. ఈ ప్రయోజనాలను భూమిలిచ్చిన వారికీ కల్పించాలనే ఉద్దేశంతో రైతుల ఆసక్తికి అనుగుణంగా... స్తిరాస్థి రంగంలో భాగస్వాములు చేశారు. నెలరోజులపాటు నిపుణులతో శిక్షణ ఇప్పించారు.
రాజధాని ప్రకటన తొలిరోజుల్లో రైతులకు సందేహాలుండేవి. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి... ఆలోచన విధానాలతో అమరావతి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా పేరు పొందుతోంది. ప్రస్తుతం రాజధాని నగరంలో 38 వేల కోట్లతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకునే అవకాశం వచ్చింది. అంతకు మించి స్థానికులు ఎదిగేందుకు... రైతులు... యువకులతో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా సీఆర్డీఏ కార్యాచరణ రూపొందించింది.