రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. పలు ప్రముఖ సంస్థలు ప్రకటించిన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు మళ్లీ చంద్రబాబే అధికారం చేపడతారని చెప్పగా... మరికొన్ని సంస్థలు 'జగన్ వస్తాడని' అంచనా వేశాయి. తన సర్వే ప్రకారం తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100కు పది స్థానాలు అటు ఇటూగా వస్తాయని మాజీ ఎంపీ లగడపాటి తెలిపారు. వైకాపాకు 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయని వెల్లడించారు. జనసేన, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు.
ఇండియాటుడే సర్వే ప్రకారం... తెదేపా 37 నుంచి 40, వైకాపా 130 నుంచి 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికొస్తే... తెదేపా 4 నుంచి 6, వైకాపా 18 నుంచి 20 గెలుస్తుందని చెప్పింది.
ఐఎన్ఎస్ఎస్ అంచనా ప్రకారం...తెదేపా 118, వైకాపా 52 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. 17 ఎంపీ స్థానాల్లో తెదేపా, 7 స్థానాల్లో వైకాపా గెలుస్తుందని అంచనా వేసింది. జనసేన 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది.
సీపీఎస్ సర్వే వివరాలు... తెదేపా 43 నుంచి 44, వైకాపా 130 నుంచి 133 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
వీడీపీ అసోసియెట్స్ అంచనా... తెదేపా 54 నుంచి 60, వైకాపా 111 నుంచి 121, జనసేన నాలుగు అసెంబ్లీ స్థానాల వరకు గెలవొచ్చని తెలిపింది.