సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. ఎల్లుండి జరగనున్న ఎన్నికలకు.. కొద్ది క్షణాల క్రితమే ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారాలతో.. బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించిన పార్టీలు, అభ్యర్థులు, శ్రేణులు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ప్రచారాన్ని నిలిపేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 7 దఫాల సార్వత్రిక ఎన్నికల్లో.. మొదటి దశలోనే తెలుగు రాష్ట్రాల పోలింగ్ పూర్తి కానుంది. రాష్ట్ర శాసనసభతోపాటు.. లోక్‌సభకూ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం.. గత 21 రోజులుగా.. పార్టీలు ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ఊరూవాడా తిరిగాయి.
175 నియోజకవర్గాలకు పోటీలో 2395 మంది అభ్యర్థులు
మార్చి 10న ఎన్నికల ప్రణాళిక విడుదలైంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసేనాటికి.. రాష్ట్ర శాసనసభలోని 175 నియోజకవర్గాలకు 2 వేల 118 మంది పోటీలో ఉన్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 344 మంది పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధానంగా 2 పక్షాల మధ్యే పోటీ ఉన్నా.. ఈసారి జనసేన రంగప్రవేశంతో.. త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్, భాజపాతో పాటు.. కమ్యూనిస్టులు తమ ఉనికి చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల ప్రచారం పూర్తయిన ప్రస్తుత సందర్భంలో.. ఎల్లుండి జరిగే పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే సిబ్బంది నియామకం, ఈవీఎంల తరలింపు.. వాటిలో బ్యాలెట్ పేపర్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేసింది. రేపు ఉదయం నుంచి సిబ్బంది.. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. కేంద్ర బలగాలను రప్పించి.. కవాతు చేయిస్తూ.. శాంతిభద్రతలపై ఎన్నికల సంఘం అధికారులు భరోసా కల్పించారు.
ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ప్రక్రియనూ ఎన్నికల సంఘం శరవేగంగా నిర్వహిస్తోంది. సాధ్యమైనంతవరకు.. ప్రతి ఓటరుకూ స్లిప్పు అందించేలా చర్యలు తీసుకుంది. ఓటరు స్లిప్పుతోపాటు.. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించి.. ఓటు వేయవచ్చని ఈసీ తెలిపింది.
ఓటుపై అవగాహన పెంచేందుకు, ఓటు ఆవశ్యకత వివరించేందుకు ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది ఎన్నికల సంఘం. స్వేచ్ఛాయుత వాతావరణంలో అర్హులంతా... తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ కోరింది.
చివరి ప్రయత్నాల్లో అభ్యర్థులు
ఈసీ మార్గదర్శకాల ప్రకారం ప్రచారాన్ని పూర్తి చేసుకున్న పార్టీలు, అభ్యర్థులు.. తమ గెలుపు కోసం చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లోని ఓటర్లను వీలైనంతగా ఆకర్షించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తున్న ఎన్నికల సంఘం... ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.